మూత్రం నుంచి ఫాస్పరస్‌ తయారీ

వాషింగ్టన్‌: మూత్రం నుంచి ఫాస్ఫరస్‌ను సేకరించే అద్భుత పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనిద్వారా పొలాలకు ఎరువులు తయారు చేయవచ్చని వివరించారు. భూమి మీద అన్ని జీవులకూ ఫాస్ఫరస్‌ అవసరం. ఎరువుల్లో ఇది ముఖ్య భూమిక వహిస్తోంది. అయితే ప్రకృతిలో ఈ ఫాస్ఫరస్‌ అపరిమితం కాదు. హరిత విప్లవంతో దీనికి డిమాండ్‌ బాగా పెరిగింది. ఫాస్ఫేట్‌కు ముడి పదార్థమైన ఫాస్ఫేట్‌ శిలలకు భవిష్యత్‌లో కొరత ఏర్పడవచ్చు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయాలపై శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. మూత్రం నుంచి దీన్ని ఒడిసిపట్టవచ్చని గుర్తించారు. ఏటా ఒక్కో వ్యక్తి దాదాపు అర కిలో మేర ఫాస్ఫరస్‌ను మూత్రం ద్వారా వెలువరిస్తారు. మూత్రాన్ని ముడి పదార్థంగా ఉపయోగించుకొని ఎరువులు, నీటిని ఉత్పత్తి చేసే విధానాన్ని ఆస్ట్రేలియా పరిశోధకులు కనుగొన్నారు. ఇందులో ఎంపిక చేసిన సూక్ష్మజీవులను ఉపయోగించి, మూత్రంలో దుర్వాసన కలిగించే పదార్థాలను ఆక్సీకరణ చేస్తారు. అమోనియాను మరింత స్థిరమైన నైట్రేట్లుగా మారుస్తారు. ఇలా శుద్ధి చేసిన మూత్రాన్ని వడకడతారు. ఫలితంగా సూక్ష్మజీవులు వేరవుతాయి. కరిగిపోయిన ఫాస్ఫరస్‌, నత్రజని మూత్రంలోనే ఉండిపోతాయి. దీనిలో మరికొన్ని మార్పులు చేయడం, గాఢత పెంచడం ద్వారా దానిని వాణిజ్య ఎరువుల తరహాలో వాడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.