గిరిజన బిడ్డల మరణాలపై మిస్టరీ తేల్చాలి

కేసముద్రం: కేసముద్రం మండలం ఇంటికన్నె రైల్వే స్టేషన్‌ సమీపంలో ఏడు సంవత్సరాల కిత్రం రైలు పట్టాలపై శవాలుగా కనిపించిన గిరిజన బిడ్డల మరణాలపై వీడని మిస్టరీని వెంటనే తేల్చాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగ డిమాండ్‌ చేశారు. సీబీఐతో విచారణ జరిపించాలని, అవసరమైతే రిపోస్టుమార్టం చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. సంఘటనా స్థలాన్ని ఆదివారం సాయంత్రం బాధితుల కుటుంబ సభ్యులతో కలిసి మంద కృష్ణమాదిగ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెక్కొండ మండలం మడిపల్లి, గంగదేవి తండాలకు చెందిన ఇద్దరు విద్యార్థులను 2012 నవంబరు 13న దారుణంగా హత్య చేసి ఇంటికన్నె రైల్వే స్టేషన్‌ సమీపంలో రైలు పట్టాలపై పడేశారన్నారు. వారి మరణాలపై అనేక అనుమానాలున్నాయన్నారు. ఆ విద్యార్థులు ఉన్నత వర్గాలకు చెందిన వారైతే ఇప్పటికే దోషులను పట్టుకొని శిక్షించే వారన్నారు. గిరిజన బిడ్డలపై జరిగిన హత్యాచారం, హత్యలను కప్పిపుచ్చేందుకే ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. వారి మరణాలపై సీబీఐ విచారణ జరిపించి నిందితులను బయట పెట్టాలన్నారు. లేని పక్షంలో లంబాడా, గిరిజన సంఘాలతో కలిసి ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యయంలో అందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.