ఆసిఫాబాద్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి కూర్పు కార్పొరేట్ వసతులను తలదన్నే రీతిలో ఉందని అయితే సేవలు కూడా ఆ స్థాయిలోనే ఉండాలని జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం రక్తనిధి కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. వైద్యులు, సిబ్బంది మాత్రం సేవల్లో నిర్లక్ష్యం చూపితే సహించేది లేదని హెచ్చరించారు. లయన్స్‌క్లబ్ వారు రక్తనిధి కేంద్ర ప్రారంభోత్సవం రోజున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ.. గిరిజనులు, పేద ప్రజలు అధికంగా ఉన్న జిల్లాలో వైద్య సకాలంలో అందక ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఆసుపత్రి సేవలు మరింత మెరుగు పరచడానికి వైద్యులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఎంపీపీ అరిగె మల్లికార్జున్ మాట్లాడారు. డీఎంహెచ్‌వో కె.బాలు, తెరాస మండలాధ్యక్షులు గాదివేని మల్లేశ్, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు చిలువేరు వెంకన్న, లయన్స్‌క్లబ్ ఇన్‌ఛార్జి అధ్యక్షులు అక్కు విజయ్‌కుమార్, జిల్లా కోర్ కమిటీ సభ్యులు పి.వెంకటరమణారెడ్డి, సభ్యులు ఎన్.శంకర్, డి.వేంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఎంపీపీ అరిగెల మల్లికార్జున్‌తో పాటు లయన్స్‌క్లబ్ కోర్ కమిటీ సభ్యులు పీచు వెంకటరమణారెడ్డి, పలువులు నాయకులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, యువకులు రక్తదానం చేశారు.