లండన్: ఆరోగ్యకరమైన ఆహారంతో పురుషుల్లో పునరుత్పత్తి సామర్థ్యం మెరుగ్గా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీనివల్ల శుక్ర కణాల్లో కదలికల స్థాయి పెరిగే అవకాశం ఉందని చెప్పారు. స్వీడన్‌లోని లింకోపింగ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన సాగించారు. ఆహారంలో చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల మానవ వీర్య కణంలో అత్యంత అవసరమైన ఆర్‌ఎన్‌ఏలోని భాగాలు ప్రభావితమవుతున్నాయా అన్నది పరిశీలించారు. 15 మంది పురుషులను ఎంపిక చేసుకొని వీరికి ఒక వారం పాటు ఆరోగ్యకరమైన ఆహారం ఇచ్చారు. రెండో వారంలో చక్కెర అధికంగా ఉన్న ఆహారాన్ని అందించారు. ఈ అధ్యయనానికి ముందు మూడో వంతు మందిలో వీర్య కణాల కదలిక చాలా తక్కువగా ఉంది. అధ్యయన కాలంలో అది సాధారణ స్థాయికి చేరుకుంది. చాలా తక్కువ సమయంలో గణనీయ మార్పును తీసుకురావచ్చని స్పష్టమవుతున్నట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. దీన్నిబట్టి శుక్ర కణాల సామర్థ్యంపై మనం తీసుకునే ఆహార ప్రభావం గణనీయం ఉంటుందని స్పష్టంగా గుర్తించారు. అయితే చక్కెరస్థాయిలు ఎక్కువగా ఉండటంవల్ల మేలు జరుగుతుందా అన్నది నిర్ధరించేందుకు మరిన్ని పరిశోధనలు అవసరం.