- 11,603 మంది విద్యార్థులకు కళ్లజోళ్లు
- సెల్‌ఫోన్ల వీక్షణ ప్రధాన కారణమని నిర్ధారణకు వచ్చిన వైద్యనిపుణులు
- జిల్లాలో కళ్లజోళ్ల పంపిణీ ప్రారంభం
- తొలివిడతగా జిల్లాకు 1209 కళ్లజోళ్లు
ఏలూరు : ఏడాదిలోపు వయస్సు నుంచే పిల్లలకు సెల్‌ఫోన్లు.. ఎల్‌కేజీ వయస్సులోనే వీడియోగేమ్‌లు.. రోజులో అధిక సమయం ఎలక్ర్టానిక్ డివైజ్‌లతోనే గడపడం.. అవుట్‌డోర్ గేమ్స్ లోపించడం.. సమతుల ఆహారం లేకపోవడం.. దృష్టిలోపం సమస్యలకు ప్రధాన కారణాలుగా నేత్ర వైద్యనిపుణులు నిర్ధారించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబరు నుంచి దశల వారీగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న బాలబాలికలకు నేత్ర పరీక్షలు నిర్వహిస్తున్న విషయం విదితమే. మొదటిదశలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 5.37 లక్షల మంది బాల బాలికలకు తొలిదశగా సాధారణ కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో దృష్టిలోపం గుర్తించిన 32,634 మంది విద్యార్థులకు రెండోదశ స్ర్కీనింగ్ పరీక్షలు చేయాల్సి ఉండగా, ఇంతవరకు 32,522 మందికి పూర్తి చేశారు. స్ర్కీనింగ్ పరీక్షలు పూర్తయిన వారిలో మొత్తం 11,603 మందికి కళ్లజోళ్లు తప్పనిసరి అని నిర్ధారించారు. మరో 3532 మంది విద్యార్థులకు మళ్లీ దృష్టి సంబంధిత పరీక్షలను వైద్యనిపుణులతో చేయించి, శస్త్ర చికిత్సల ద్వారా నయం చేసే విషయమై నిర్ణయం తీసుకోనున్నారు.
సెల్‌ఫోన్లతో కంటిచూపు సమస్యలు తీవ్రం..
జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం ఇన్‌ఛార్జి, జిల్లా అంధత్వ నివారణ ఇన్‌చార్జి డాక్టర్ అరుణ నేతృత్వంలోని నేత్రవైద్యనిపుణుల బృందం విద్యార్థుల్లో దృష్టిలోప సమస్యలకు కారణాలపై విశ్లేషించగా, పలు దిగ్ర్భాంతికర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. బాల్యం నుంచే పిల్లలు సెల్‌ఫోన్‌లను ఎక్కువగా వినియోగిస్తుండడం వల్ల పాఠశాలలో అడుగుపెట్టే నాటికే కంటి చూపు సమస్యలు ఎదుర్కొంటున్నట్టు గుర్తించారు. ఇటువంటి పిల్లలు ఒక కన్ను చూపునకు పరిమితం కావడం, తల్లిదండ్రులు కూడా పిల్లల కంటి సమస్యలపై శ్రద్ధ తీసుకోకపోవడం, తదితర కారణాల వల్ల దృష్టి సమస్యలు తీవ్రమవుతు న్నట్టు గమనించారు. ఇటువంటి పిల్లలను ఆరేళ్ల లోపు గమనించి, సరైన జాగ్రత్తలు తీసుకుంటే కళ్లద్దాలతోనే సరిపెట్టవచ్చని, శస్త్ర చికిత్సల అవసరం ఉండబోదని విశ్లేషించారు. ప్రస్తుత ఎలక్ర్టానిక్ డివైజ్‌ల యుగంలో విద్యార్థి వయస్సు నుంచే ఏడాదికొకసారి నేత్ర పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరమని ఈ బృందం సూచి స్తోంది. వీటితోపాటు ఆకుకూరలు, బొప్పాయి, క్యారెట్, తాజా పండ్లు, పాలు, గుడ్లు, నిత్యం తీసుకునే ఆహారంలో భాగంగా చేసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
కళ్లజోళ్ల పంపిణీ ప్రారంభం..
కంటి వెలుగు స్ర్కీనింగ్ పరీక్షల్లో గుర్తించిన విద్యార్థులకు కళ్లజోళ్ల పంపిణీని ప్రారంభిం చారు. తొలివిడతగా జిల్లాకు 1209 కళ్లజోళ్లు వచ్చాయి. వీటిని ఆయా మండలాల్లో పాఠశాలలకు అందజేశారు. మొత్తంమీద ఫిబ్రవరి నాటికి గుర్తించిన విద్యార్థులందరికీ కళ్లజోళ్లు అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక మెల్లకన్ను, రిఫరల్ విద్యార్థులకు మూడోదశ కంటి వెలుగు కార్యక్రమం కింద వైద్యనిపుణులతో పరీక్షలు చేయించి, తదుపరి చర్యలు చేపట్టనున్నారు. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి సాధారణ ప్రజలకు కూడా కంటి వెలుగు పరీక్షలను చేపట్టడానికి తాజాగా నిర్ణయం తీసుకున్నారు. 40 ఏళ్ల వయస్సు పైబడిన వారిలో చత్వారం, శుక్లాలు వంటి సమస్యలు వస్తాయని, వీటికి చికిత్సలు చేపట్టేందుకు, స్ర్కీనింగ్ పరీక్షలు నిమిత్తం అవసరమైన వైద్యపరికరాలను జిల్లాకు పంపించే ప్రక్రియను కొద్దిరోజుల్లో ప్రారంభించనున్నారు.