ఆరోగ్యకేంద్రాల్లో నిండుకున్న రేబిస్ వ్యాక్సిన్ల నిల్వలు
రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి
అమరావతి: కుక్కకాటు చికిత్సకు వినియోగించే రేబిస్ వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకు అవసరాలకు తగ్గట్టు వ్యాక్సిన్లు సరఫరా కావడం లేదు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుంచి పంపుతున్న ప్రతిపాదనల మేరకు వైద్య సేవలు, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ సమకూర్చలేకపోతోంది. సర్దుబాటు కోసం స్థానికంగా ఆసుపత్రుల వారు కొనుగోళ్లు చేస్తున్నా అవసరాలు తీరడం లేదు. పీహెచ్‌సీలలో వ్యాక్సిన్లు లేక రోగులు సమీప ప్రాంతీయ, సామాజిక, జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.
* విశాఖ జిల్లా పాయకరావుపేట మండలంలోని పీహెచ్‌సీలలో వ్యాక్సిన్ లేదు. రావికమతం, కొత్తకోట పీహెచ్‌సీలలోనూ ఇదే పరిస్థితి.
* నెల్లూరు జిల్లాలో ప్రస్తుత త్రైమాసికానికి ఆరు వేలకుపైగా వైల్స్ అవసరంకాగా 3,570 మాత్రమే వచ్చాయి.
* కాకినాడలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో 500 వైల్స్ మాత్రమే ఉన్నాయి. ప్రత్తిపాడు, ఏలేశ్వరం, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరాలకు తగ్గట్టు పంపిణీ లేదు. పెద్దాపురం ఆసుపత్రి, కండ్రకోట, గొల్లప్రోలు, చేబ్రోలు, నాగుల్‌లంక పీహెచ్‌సీలు, తుని ప్రాంతీయ ఆసుపత్రిలోనూ సమస్య నెలకొంది.
* పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి, తణుకు, జంగారెడ్డిగూడెం, నల్లజర్ల మండలాల్లో కొరత ఏర్పడింది.
* అనంతపురం బోధనాసుపత్రికి ఈ త్రైమాసికానికి 2,000 వైల్స్ అవసరమని అధికారులు నివేదించగా కేవలం 50 మాత్రమే వచ్చాయి. అదనంగా మరో వంద వైల్స్‌ను స్థానికంగా కొన్నారు. సమస్యను ఉన్నతాధికారులకు నివేదించామని బోధనాసుపత్రి సూపరింటెండెంట్ రామస్వామినాయక్ తెలిపారు.
దశలవారీగా కొరత నివారణ: రేబిస్ వ్యాక్సిన్లు తయారుచేసే సంస్థలు దేశంలో అతి తక్కువగా ఉన్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఆర్డర్లకు తగ్గట్టు సరఫరా చేయడానికి సమయం పడుతోంది. అయినా గట్టి ప్రయత్నాల వల్ల ఇటీవల పదివేల వైల్స్ వచ్చాయి. మరో పదివేలు రానున్నాయి. దశలవారీగా కొరత తీరనుంది.