
భాస్కరపురం (మచిలీపట్నం): జిల్లా ఆసుపత్రిలో అర్ధరాత్రి, అత్యవసర వేళల్లోనూ మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. రాత్రి సమయాల్లో మహిళా వైద్యులను, సిబ్బందిని సకాలంలో ఆసుపత్రికి తీసుకొచ్చేందుకు నూతనంగా కాల్ డ్యూటీ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. బందరు మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం, బాడిగ శేషగిరిరావు రామాయమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన కారును మంత్రి పేర్ని, బాడిగ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ కొన్ని నెలల క్రితం ఆసుపత్రిలో జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో మహిళా వైద్యులు, సిబ్బంది రాత్రి సమయాల్లో, అత్యవసర వేళల్లో వైద్యశాలకు రావాలంటే అసౌకర్యంగా ఉంటుందని వాపోయారని చెప్పారు. వెంటనే బాడిగకు ఫోన్ చేసి ఆసుపత్రి అవసరాల కోసం సెకండ్ హ్యాండ్ కారు కావాలని కోరగా, నూతన వాహనమే ఇస్తానని బాడిగ హామీ ఇచ్చారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.11.75 లక్షల టాటా నెక్సాన్ కారును వితరణగా అందించారని ఆయన సేవలను కొనియాడారు. అనంతరం బాడిగ మాట్లాడుతూ మంత్రి పేర్ని తనకు సోదర సమానులని, పేదప్రజల అవసరాల కోసం వాహనం కోరారని, స్పందించి కారును అందజేసినట్లు చెప్పారు. ఆసుపత్రి ఆర్‌ఎంవో డా.మల్లికార్జునరావు, బ్లడ్‌బ్యాంక్ అధికారి డా.అల్లాడ శ్రీనివాసరావు, నర్సింగ్ సిబ్బంది మాట్లాడుతూ కారు ఏర్పాటుకు కృషి చేసిన మంత్రికి, అందుకు సహకరించిన బాడిగకు కృతజ్ఞతలు తెలిపి ఇద్దర్నీ సత్కరించారు. అనంతరం కారు తాళాలను సూపరింటెండెంట్ డా.ఎం.జయకుమార్‌కు అందజేయగా మంత్రి స్వయంగా నడిపిన కారులో బాడిగ, నర్సింగ్ సిబ్బంది కొంత దూరం ప్రయాణించారు.