ఆరోగ్యమే అసలుసంపద

జగిత్యాల టౌన్‌: మంచి ఆరోగ్యమే మనిషికి నిజమైన సంపద అని కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పోర్ట్స్‌మీట్‌ శనివారంతో ముగిసింది. ముఖ్య అతిథిగా కలెక్టర్‌ శరత్‌ హాజరై గెలుపొందిన పోలీసులకు ఎస్పీ సింధు శర్మతో కలిసి బహుమతులు అంద జేశా రు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ క్రీడలతో పోలీస్‌ సిబ్బందిలో టీమ్‌ వర్క్‌ మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. క్రీడలు అనేవి ప్రతి ఒక్కరూ జీవితంలో అలవాటు చేసుకోవాలని కోరారు. లక్ష్యం చేరువ కావాలంటే ఆటల్లో రాణించాలని అన్నారు. నిత్యం శాంతి భద్రతల పరిరక్షణలో బిజీ బిజీగా ఉండే పోలీసులు మూడు రోజుల పాటు క్రీడల్లో హుషారుగా పాల్గొనడం మిగతా క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమన్నారు. అనంతరం ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ జగిత్యాల జిల్లా ఆవిర్భవించిన అనంతరం మొదటిసారిగా పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌ను నిర్వహించామని పేర్కొన్నారు. హోంగార్డు నుంచి జిల్లా స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరినీ పోటీల్లో పాల్గొనేటట్లు చేశామని పేర్కొన్నారు.

 

క్రీడలతో పోలీస్‌ ఉద్యోగుల్లో సోదరభావంతో పాటు ఆరోగ్య ప్రాముఖ్యత పెరుగుతుందని వివరించారు. రానున్న 2020 నూతన సంవత్సరంలో జిల్లా పోలీసులు రెట్టింపు ఉత్సాహంతో పారదర్శకంగా ప్రజలకు మంచి సేవలు అందించాలని కోరారు. అంతకుముందు పోలీసులు నిర్వహించిన పరేడ్‌ జగిత్యాల పట్టణ ప్రజలను ఆకట్టుకుంది. ఏఆర్‌, ధర్మపురి సర్కిల్‌, జగిత్యాల టౌన్‌, రూరల్‌ పోలీసులు, కోరుట్ల సర్కిల్‌, మల్యాల, మెట్‌పల్లి సర్కిల్‌లు, ఎస్‌బీ పోలీసులు వేర్వేరుగా పరేడ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ దక్షిణా మూర్తి, ఎస్‌బీ డీఎస్పీ రామారావు, ఏఆర్‌ డీఎస్పీ ప్రతాప్‌, జగిత్యాల, మెట్‌పల్లి డీఎస్పీలు వెంకటరమణ, గౌస్‌బాబా, సీఐలు జయేష్‌ రెడ్డి, రాజేష్‌, లక్ష్మీబాబు, కిషోర్‌, రవి, వామన్‌, నవీన్‌, సరీలాల్‌, సుధాకర్‌తో పాటు జిల్లాలోని ఎస్సైలు పాల్గొన్నారు.