జగిత్యాల: క్రీడలతోనే ఆరోగ్యంగా ఉండవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. జగిత్యాల మినీస్టేడియంలో మూడు రోజులుగా జరిగిన జిల్లాస్థాయి పోలీసు క్రీడల ముగింపు సందర్భంగా శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆటలు నిత్యజీవితంలో భాగం కావాలని దీనివల్ల మానసికంగా, శారీరకంగా ఉండగలుగుతామన్నారు. ఉద్యోగులకు టీం వర్క్ ముఖ్యమని అది క్రీడలతో సాధ్యమవుతుందన్నారు. జిల్లా ఎస్పీ సింధుశర్మ మాట్లాడుతూ.. జిల్లా ఆవిర్భావం తర్వాత అధికారి నుంచి హోంగార్డు వరకు తొలిసారి క్రీడాపోటీలు నిర్వహించామని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. ఈ స్ఫూర్తితో వచ్చే ఏడాది తమ విధులకు మరింత పదును పెట్టాలని పని ఒత్తిడి ఉన్నప్పటికి నేరాల నియంత్రణలో గత ఏడాది కాలంలో మంచి ఫలితాలు సాధించామని మున్ముందు ఆధునిక సాంకేతికతను వినియోగించుకొని శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని ఎస్పీ అన్నారు. క్రీడల నిర్వహణకు కృషి చేసిన అధికారులను అభినందించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్‌గా జగిత్యాల సబ్ డివిజన్, రన్నరప్‌గా ఆర్మ్‌డ్ రిజర్వ్ సిబ్బంది తమ ప్రతిభ చాటారు. క్రికెట్‌లో ఆర్మ్‌డ్ రిజర్వ్ మొదటి స్థానం పొందగా, మెట్‌పల్లి సబ్ డివిజన్ ద్వితీయ స్థానం పొందింది. వాలీబాల్‌లో ఆర్మ్‌డ్ రిజర్వ్ మొదటి స్థానం పొందగా, జగిత్యాల సబ్ డివిజన్ ద్వితీయస్థానం పొందింది. బాస్కెట్‌బాల్ జగిత్యాల సబ్ డివిజన్ మొదటిస్థానం పొందగా స్పెషల్‌బ్రాంచి విభాగం ద్వితీయస్థానం పొందింది. కబడ్డీలో జగిత్యాల సబ్‌డివిజన్ ప్రథమస్థానం, ఆర్మ్‌డ్ రిజర్వ్ ద్వితీయస్థానం పొందింది. కార్యక్రమంలో అదనపు ఎస్పీ దక్షిణామూర్తి, డీఎస్పీలు పి.వెంకటరమణ, గౌస్‌బాబా, రామారావు, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.