విద్యానగర్ : జిల్లాలోని స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా ప్రత్యేకాధికారి వెంకటేశ్ దోత్రే హెచ్చరించారు. జనహిత సమావేశ హాలులో జిల్లా వైద్యారోగ్య, ఐసీడీఎస్ శాఖల ఆధ్వర్యంలో పీసీపీఎన్‌డీటీ అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కామారెడ్డిలో గుర్తింపు పొందిన అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లు 24 ఉన్నాయని తెలిపారు. గర్భిణుల ఆరోగ్య పరీక్షల్లో భాగంగా యూసీజీలో ఎక్కడా కూడా లింగనిర్ధారణ పరీక్షలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. లింగనిర్ధారణ పరీక్షలు చేయించకుండా కుటుంబ సభ్యులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రైవేట్ దవాఖానల్లో డయాగ్నస్టిక్ సెంటర్లు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, గుర్తింపు లేని వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, ఐసీడీఎస్ అధికారి అనురాధ, ప్రోగ్రాం అధికారులు కరుణ శ్రీ, శోభారాణి, అనిల్ కుమార్, మోహన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.