వృద్ధాప్యం శరీరానికే.. మనసుకు కాదు

విజయనగరం : వృద్ధాప్యం శరీరానికేనని, మనసుకు కాదని, ప్రతీ ఒక్కరు సమాజాభివృద్ధికి పాటుపడాలని సీఈఏ (కేంద్ర విద్యుత్తు అథారిటీ) విశ్రాంత ఎక్స్‌ అఫిషియో కార్యదర్శి వి.వి.రామకృష్ణారావు తెలిపారు. ఆదివారం మహారాజా కళాశాల (ఎంఆర్‌ఎంపీ పూర్వనామం) పూర్వ విద్యార్థులు సమ్మేళనానికి (1968-69) ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇక్కడ చదువుకొని దేశానికి పలు విధాలుగా సేవ చేసే అవకాశం వచ్చినందుకు గర్విస్తున్నాని తెలిపారు. యువతకు మార్గనిర్దేశం చేస్తూ దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించేలా తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత వృద్ధులపై ఉందన్నారు. పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు కె.వి.వరహారావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మాన్సాస్‌ కరస్పాండెంట్‌ కె.వి.లక్ష్మీపతిరాజు, సంఘం నాయకులు బి.వి.ముఖలింగస్వామి, జి.పుష్పాంజలి, డి.జెతానంద్‌, కె.అప్పన్న శెట్టి పాల్గొన్నారు.


దేవస్థానం సత్రానికి సోలార్‌ వితరణ: విజయనగరంలోని సింహాచలం దేవస్థానం (శ్రీ వరహలక్ష్మీ నరసింహస్వామి)విద్యార్థి భోజన వసతిగృహానికి (సత్రం) సంఘం తరఫున 2 కేవీ సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ను వితరణగా అందజేశారు. దీనిని కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు ప్రారంభించారు.