జగిత్యాల : ఈ శీతాకాలంలోనే తొలిసారిగా చలి ప్రభావం చూపిస్తుండటంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ఉత్తర భారతం నుంచి వచ్చే చలి గాలుల వల్ల ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తుండటం, ఉదయంపూట పొగమంచు కమ్ముకుని ఉండటంతో నాలుగైదు రోజులుగా భిన్నమైన వాతావరణం నెలకొంటోంది. ఈదర గాలులవల్ల చలిప్రభావం మరింతగా ఎక్కువై రాత్రిపగలూ తేడాలేకుండా చలితోకూడిన వాతావరణం అలుముకునే ఉంటోంది. జిల్లాలో ఈ సీజన్‌లోనే తొలిసారిగా కనిష్ఠ ఉష్ణోగ్రత 9.5 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గగా గరిష్ఠ ఉష్ణోగ్రత కూడా తగ్గుముఖం పట్టి 26 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతోంది. మరో వారంరోజుల వరకు చలిప్రభావం అధికమవుతుందని వాతావరణ నిపుణులు సూచిస్తుండగా చిన్నపిల్లలు, వృద్ధులు, వ్యాధిగ్రస్థులు, వాహనాలపై ప్రయాణించేవారు చలినుంచి రక్షణకు తగిన జాగ్రత్తలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.