ప్రసూతి ఆస్పత్రి ఎదుట పేలిన నాటుబాంబులు

తిరుపతి : తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఎదుట శనివారం రాత్రి రెండు నాటుబాంబులు పేలాయి. దీంతో ఆస్పత్రితోపాటు ఆధ్యాత్మిక నగరంలో కలకలం రేగింది. రాయలసీమ పరిధిలోనే పేరున్న ఆస్పత్రి కావడం.. మూడు వందల పడకలు కావడంతో నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రాత్రి 8.45 గంటల ప్రాంతంలో ఓ కుక్క నోటితో ప్లాస్టిక్‌ కవర్‌ను తీసుకొచ్చింది. అందులో ఏదైనా ఆహార పదార్థం ఉంటుందన్న ఆశతో కొరికింది. అంతే ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ నాటు బాంబు పేలింది. ఆ ప్రమాద తీవ్రతకు కుక్క తల ఛిద్రమైంది. సెక్యూరిటీ సిబ్బంది శబ్దం వచ్చిన ప్రదేశానికి వస్తుండగా.. మరోసారి బాంబు పెద్ద శబ్దంతో పేలింది. నిమిషాల వ్యవధిలోనే రెండు బాంబులు పేలడంతో పరిసరాల్లోని సిబ్బంది, రోగుల సహాయకులు పరుగులు తీశారు. ఏమి జరుగుతుందో అన్న ఆందోళనకు గురయ్యారు.

 

సమాచారం అందుకున్న అలిపిరి, వెస్ట్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాంబ్‌ డిస్పోజబుల్‌, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలను రప్పించి పరిశీలించారు. కుక్క చనిపోయిన ప్రాంతానికి సమీపంలోనే మరో ఆరు బాంబులను గుర్తించారు. వాటిని వెంటనే నిర్వీర్యం చేయడంతో అక్కడున్నవారు ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం దాదాపు గంటపాటు పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేసిన పోలీసులు.. పేలిన బాంబు శకలాలు, చనిపోయిన కుక్క కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు.