వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్
పద్మారావునగర్: ప్రకృతి సహజమైన వనమూలికలతో అందిస్తున్న చికిత్సలతో అనేక మొండి రోగాలు నయం అవుతున్న టిబెటన్ వైద్యవిధానంపై నమ్మకం పెరుగుతోందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. దలైలామా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టిబెటన్ మెడికల్ అండ్ ఆస్ట్రోలాజికల్ ఇన్‌స్టిట్యూట్ 103వ వ్యవస్థాపక దినోత్సవాలను పద్మారావునగర్‌లోని మెనో-త్సి-ఖాంగో టిబెటన్ ప్రజా ఆరోగ్య సేవాకేంద్రంలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరిగే వేడుకలను మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. పర్వతప్రాంతమైన టిబెట్‌లో కాలుష్యానికి దూరంగా, మంచి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా అక్కడి ప్రజలు ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటున్నారని పేర్కొన్నారు. ప్రజా ఆరోగ్య సేవాకేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నవాంగ్‌గెలెక్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, బన్సీలాల్‌పేట, సీతాఫల్‌మండీ కార్పొరేటర్లు హేమలత, హేమ, కేంద్రం కోఆర్డినేటర్లు రామచంద్రరాజు, రామకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు.