ఒంటిమిట్ట: దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి 'ఆరోగ్యశ్రీ- పింఛన్లు' ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణలో ఆరోగ్య, ఆశా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సర్వే చేశారు. 2005 నుంచి ఆరోగ్యశ్రీ పథకంలో లబ్ధి పొందిన వారి జాబితాను ఆయా మండలాలకు పంపించారు. ఆ మేరకు ఈ ఏడాది అక్టోబరు 26న జారీ చేసిన ఉత్తర్వు-551 అనుసరించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా పక్షవాతంతో 2,805 మంది అనారోగ్యం బారిన పడినట్లు జాబితా ఇచ్చారు. అందులో 757 మంది మృతి చెందారు. స్థానిక నివాస ప్రాంతం నుంచి 93 మంది వలస వెళ్లారు. 220 మంది చిరునామా లభించలేదు. 448 మందికి నయమైంది. మరో 56 మంది కోలుకున్నారు. కుష్ఠు వ్యాధితో 753 బాధపడుతున్నారు. అందులో 42 మంది వివరాలు లభ్యం కాలేదు. 711 మందికి పింఛను పొందేందుకు అర్హత ఉన్నట్లు గుర్తించారు. తలసేమియాతో 79 మంది బాధపడుతున్నట్లు జాబితా అందింది. 69 మందికి అర్హత ఉంది. ముగ్గురు వలస వెళ్లగా, చిరునామా లేని వారు ఒకరు, ఇంకా మరో ఆరుగురి నుంచి సమాచారాన్ని సేకరించాల్సి ఉంది. ఈ విభాగంలో ఉన్న వారికి నెలకు రూ.10 వేలు అందనుంది. రక్తం గడ్డకట్టని (హిమోఫిలియా) వారు 148 మంది ఉన్నట్లు వివరాలను ఆయా వైద్యాలయాకు పంపించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి 72 మందికి అర్హత ఉన్నట్లు నివేదించారు. ఇద్దరు మృతి చెందగా, ఏడుగురు వలస వెళ్లారు. 13 మంది వివరాలు లభించలేదు. ఇంకా 54 మంది సమాచారాన్ని సేకరించాలి. బోదకాలు ఉన్న వారు 15 మంది, మూత్రపిండాల మార్పిడి చేసుకున్నవారు 29 మంది ఉంటే 12 మందిని అర్హులుగా నిర్ధరించారు. ఏడు మంది కన్నుమూశారు. చిరునామా లేని వారు 10 మంది ఉన్నట్లు నివేదించారు. మొత్తం మీద 1,486 మందికి అర్హత ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు.
పారదర్శకంగా ఎంపిక చేశాం : రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబరు 26న ఉత్తర్వు-551 అనుసరించి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించాలని క్షేత్రస్థాయిలో సర్వే చేశాం. ఆరోగ్యశ్రీలో లబ్ధిపొందిన వారిలో కొంతమందికి నయమైంది. మరికొందరు కోలుకుంటున్నారు. ఇంకొందరు మృతి చెందారు. జబ్బుతో తీవ్రంగా బాధపడుతున్న వారికి నిబంధనలను అనుసరించి పింఛను మంజూరు చేసేందుకు 1,486 మందికి అర్హత ఉన్నట్లు నిర్ధరించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిరంతరం సాగుతుంది. - ఎన్.ఉమాసుందరి, వైద్య ఆరోగ్యశాఖాధికారిణి, కడప