రాష్ట్రం గజగజ ...ఆదిలాబాద్‌ జిల్లా అర్లిలో అత్యల్పంగా 5 డిగ్రీలు


 హైదరాబాద్‌: చలి పులి పంజాకు రాష్ట్ర ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం అర్లి(టి) గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున అత్యల్పంగా 5, సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ 5.5, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌(యు)లో 6.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్ర వాతావరణ చరిత్రలో అత్యల్ప ఉష్ణోగ్రత 2017 డిసెంబరు 27న 3.5, నిజామాబాద్‌లో 1897 డిసెంబరు 17న 4.4 డిగ్రీలు రికార్డుల్లో ఉంది. దీనికి చేరువగా ఇప్పుడు 5 డిగ్రీలకు చేరింది. ఉత్తర తెలంగాణలో చలిగాలులు వీస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉష్ణోగ్రత 5 డిగ్రీలకు పడిపోతే చలిగాలుల హెచ్చరిక జారీ చేస్తారు. అర్లి(టి) గ్రామంలో చలికి తట్టుకోలేక కిష్టాభాయి(90) అనే వృద్ధురాలు మృతి చెందారు. ఈ ప్రాంతంలో చలికి తట్టుకోలేక ప్రజలు చలి మంటలు వేసుకుని కూర్చుంటున్నారు. హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో ఉష్ణోగ్రత చాలా తగ్గుతోంది. నగరం మధ్య బేగంపేట ప్రాంతంతో పోలిస్తే శివారులోని పటాన్‌చెరులో 3.4 డిగ్రీల వరకూ తక్కువగా ఉంటోంది. నగరంలో భవనాలు, కాలుష్యం వల్ల ఉష్ణోగ్రత కాస్త ఎక్కువగా ఉంటోంది.