14.4 శాతం మంది దంపతులవి మేనరికాలు
తరగతి పెరుగుతున్న కొద్దీ తగ్గుతున్న అక్షరాస్యత
రవాణా, పౌరసేవలు పొందడంలోనూ సమస్యలు
దివ్యాంగులపై జాతీయ నమూనా సర్వేలో వెల్లడి
హైదరాబాద్: రాష్ట్రంలో మేనరిక వివాహాల కారణంగా పిల్లలు శారీరక, మానసిక లోపాలతో జన్మిస్తున్నట్లు వెల్లడైంది. గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లో ఇలాంటి వివాహాలు ఎక్కువ జరుగుతున్నాయి. దివ్యాంగులైన పిల్లల తల్లిదండ్రుల రక్తసంబంధాన్ని అంచనా వేసినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో 13.5 శాతం, పట్టణాల్లో 16 శాతం మందివి మేనరిక వివాహాలని అధ్యయనంలో వెల్లడైంది. సగటున 14.4 శాతం మందిలో వైకల్యానికి ఈ ఘటనలు కారణంగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా దివ్యాంగులపై జాతీయ నమూనా సర్వే నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ప్రస్తుత సర్వే ప్రకారం రాష్ట్ర జనాభాలో 2 శాతం మంది దివ్యాంగులు ఉన్నారు. గ్రామాల్లో వీరి సంఖ్య అధికంగా ఉంటే.. అందులోనూ శారీరక వైకల్యం కలిగిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది.
రాష్ట్రానికి సంబంధించి సర్వేలో వెల్లడైన విషయాలు...
* దివ్యాంగులైన పిల్లల్లో అక్షరాస్యత తక్కువగా ఉంటోంది. శారీరక వైకల్యం కలిగిన వారికీ సాధారణ పాఠశాలలు సీట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. దీనివల్ల ప్రాథమిక విద్యకు చిన్నారులు దూరమవుతున్నారు. బాలురతో పోల్చితే అక్షరాస్యులైన బాలికలు తక్కువ. ఏడేళ్ల వయసు దాటిన వారిలో అక్షరాస్యత 40.7 శాతానికే పరిమితమైంది. 15 ఏళ్ల వయసు దాటి పదోతరగతి పూర్తిచేస్తున్న వారి శాతం 20.8గా ఉంటోంది.
* వైకల్యంతో పుడుతున్న చిన్నారుల సంఖ్య 23.2 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా ఉంటే.. పట్టణాల్లో ఎక్కువ ఉన్నట్లు వెల్లడైంది. మిగతావారికి పుట్టిన ఏడాదిలోపు వైకల్యం ప్రాప్తించినట్టు తెలుస్తోంది. శారీరక, దృష్టి, వినికిడి, బధిర లోపాలు ఎక్కువగాఉంటే.. మానసిక వైకల్య లోపం 0.1 శాతంగా నమోదైంది.
* వైకల్యాన్ని గుర్తించిన వెంటనే ఎక్కువ మంది వైద్యుల సమక్షంలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ చికిత్సకయ్యే ఖర్చును భరించలేక 4.5శాతం మంది వైద్యానికి దూరంగా ఉన్నారు.
* దివ్యాంగులు ప్రజారవాణా, ప్రభుత్వ భవనాల్లో సేవలు పొందేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రవాణాసేవలు పొందిన వారిలో 70.7 శాతం, ప్రభుత్వ భవనాల్లో 67.4 శాతం మంది ఇబ్బందులు పడ్డామని వివరించారు. దివ్యాంగుల్లో 5.4 శాతం మంది ఒంటరిగా జీవిస్తున్నారు.