సాధారణ ప్రసవానికి జై

ఉమ్మడి జిల్లాలోని సర్కారీ ఆసుపత్రుల్లో 40శాతానికి పైగా అవే..


అత్యవసరమైతేనే శస్త్రచికిత్సలు


క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్న ఆరోగ్యశాఖ


ముందుకొస్తున్న గర్భిణులు


 ఎంజీఎం ఆసుపత్రి: ఉమ్మడి జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయి... ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు కల్పిస్తున్న అవగాహన అక్కరకు వస్తోంది.. ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతోంది.. పల్లెల్లో సర్కారీ దవాఖానాలపై నమ్మకం పెరుగుతోంది.. గర్భిణులు సాధారణ ప్రసవాలకు మొగ్గు చూపుతున్నారు.. ఇక్కడ కాన్పులు చేయించుకోవడానికి ముందుకొస్తున్నారు..

ప్రత్యేక దృష్టి


గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గర్భం దాల్చిన మహిళను ప్రసవమయ్యే వరకు కనిపెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. గర్భిణి అయిన వెంటనే వివరాలను నమోదు చేయడంతో పాటు, నెలనెలా వైద్యపరీక్షలు చేసేలా ఆశ, ఏఎన్‌ఎం బాధ్యత తీసుకొనేలా చేస్తోంది. వైద్యశాలకు వెళ్లి, రావడానికి 102 వాహనసేవలను సమకూరుస్తోంది. సుఖప్రసవం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తోంది. కేసీఆర్‌కిట్టుతోపాటు మగబిడ్డయితే రూ.12వేలు, ఆడబిడ్డయితే రూ.13వేలు ఇచ్చే ప్రోత్సాహకాల గురించి చెబుతోంది. హైరిస్క్‌ గర్భిణులను ముందే గుర్తించి మెరుగైన వైద్యసేవలను అందిస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాలలో పోషకాహారం అందిస్తోంది. ఇన్ని రకాల సేవలను అర్థం చేసుకున్న మహిళలు సాధారణ ప్రసవాలకు మొగ్గు చూపుతున్నారని వరంగల్‌ రూరల్‌ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ మధుసూదన్‌ తెలిపారు.


ఇక్కడ ఎక్కువ..: జనగామ, మహబూబాబాద్‌ ఏరియా ఆసుపత్రులతో పాటు నర్సంపేట, ములుగు, వర్ధన్నపేట, ఏటూరునాగారం, స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి, గూడూరు, చిట్యాల కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లలో, నగరంలోని హన్మకొండ ప్రసూతి, సీకేఎం వైద్యశాలల్లో సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక్కడ నెలకు సుమారు 666 ప్రసవాలు జరిగితే అందులో 418లకు పైగా సాధారణం అవుతున్నాయి.


వారిలో అనారోగ్య సమస్యలు..


సిజేరియన్‌ ద్వారా ప్రసవమైన మహిళలకు అనారోగ్య సమస్యలు వస్తాయని అర్బన్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, స్త్రీవైద్య నిపుణురాలు డాక్టర్‌ లలితాదేవి అన్నారు. పిల్లలకు శ్వస కోశవ్యాధులు ఆస్తమా, ఎలర్జీలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నారు. మహిళల్లో ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయన్నారు.


జనవరి నుంచి డిసెంబరు వరకు జిల్లాల వారీగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయిన సాధారణ ప్రసవాలు


             పీహెచ్‌సీల్లో   సీహెచ్‌సీల్లో


వరంగల్‌ అర్బన్‌ 4000 -


వరంగల్‌ రూరల్‌ 988 82


మహబూ బాబాద్‌ 1562 52


జనగామ 1711 217


ములుగు 1702 702


జయశంకర్‌ భూపాలపల్లి 406 102