విశాఖ: విశాఖలో గ్లోబల్ హెల్త్ కేర్ సమ్మిట్ 2021 జనవరిలో నిర్వహించాలని నిర్ణయించారు. తొలిసారిగా తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న ఈ సదస్సు విశాఖ వేదికగా జరగనుంది. ఇప్పటివరకు వివిధ రాష్ట్రాలలో 13 సార్లు ఈ సదస్సును అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ అఫ్ ఇండియన్ ఆరిజన్ (ఆపి) నిర్వహించింది. మూడు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సుకు వివిధ దేశాల నుంచి దాదాపు 500 మంది ప్రతినిధులతో పాటు వందల సంఖ్యలో భారతీయ వైద్యులు, వైద్య విద్యార్ధులు హాజరవుతారని ఆపి అధ్యక్షులు డాక్టర్ సుధాకర్ జొన్నలగడ్డ వివరించారు. విశాఖలోని ఆంధ్ర వైద్య కళాశాల పూర్వ విద్యార్థిగా ఆపి అధ్యక్షపదవి తనకు లభించిందని, ఈ తరుణంలో విశాఖ లో వచ్చే ఏడాది ఈ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. వైద్య రంగంలో ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేస్తామని, గ్రామాలకు వైద్యం అందించే అంశంలో వారు కోరిన చోట సహకారం అందిస్తామన్నారు. అమెరికాలో భారత సంతతికి చెందిన 60 వేల మంది ఫిజీషియన్లు సభ్యులుగా ఆపి ఏర్పడిందన్నారు. అమెరికాలో ఈ సంఘం అతిపెద్ద వైద్య సంఘంగా ఉందని వివరించారు. గడచిన 34 సంవత్సరాల్లో ఇండియన్ ఫిజీషియన్స్ అమెరికా వైద్య రంగంలో చెప్పుకోదగిన పాత్ర పోషిస్తున్నారని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విశ్రాంత ఉపకులపతి డాక్టర్ రవిరాజ్ అన్నారు. ఈ సదస్సు ద్వారా రెండు దేశాల వైద్యుల మధ్య పరస్పర వైద్యపరమైన అంశాలు తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆయన వివరించారు. ఈ సందర్భంగా సదస్సు బుక్ లెట్ ను విడుదల చేశారు.