ఎంజీఎం ఆసుపత్రి: ఆరోగ్య కార్యక్రమాలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరు కాకుండా డుమ్మా కొట్టిన 17 మంది వైద్యాధికారులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లలితాదేవి తాఖీదులు జారీ చేశారు. శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో కీటకజనిత వ్యాధుల నిర్మూలనపై అర్బన్ జిల్లా వైద్యాధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మలేరియా విభాగ అదనపు సంచాలకుడు డాక్టర్ అమర్‌సింగ్ పాల్గొనగా, మధ్యాహ్నం వరకు 25 మంది వైద్యాధికారులకు కేవలం 8 మంది మాత్రమే హాజరయ్యారు. దీంతో అదనపు సంచాలకుడు అమర్‌సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజరుకాని వైద్యాధికారులకు మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. దీంతో సమావేశంలో ఉన్న డీఎంహెచ్‌వో డాక్టర్ లలితాదేవి సమావేశానికి గైర్హాజరైన 17మంది వైద్యాదికారులకు తాఖీదులు జారీ చేశారు. గైర్హాజరుపై వారం రోజుల్లో సమాధానం చెప్పాలని పేర్కొన్నట్లు తెలిపారు.