రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు
ఆదిలాబాద్:ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత ఒక్కసారి పెరిగిపోయింది. శుక్రవారం అత్యల్ప ఉష్ణోగ్రత 17.2 డిగ్రీలు నమోదు కాగా ఒక్కరోజు వ్యవధిలోనే శనివారం 10 డిగ్రీలు తగ్గింది. రికార్డుస్థాయిలో ఆదిలాబాద్ జిల్లా తాంసిలో 7.1 డిగ్రీలు కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చలి తీవ్రతతో ప్రజలు ఉదయం 11 గంటల వరకు ఇంటిగుమ్మం దాటలేదు. చల్లని గాలులు వీస్తుండటంతో ప్రయాణ ప్రాంగణాలు, రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దినమంతా చల్లని గాలులు వీస్తూనే ఉన్నాయి. తూర్పు రాష్ట్రాల నుంచి వీస్తున్న గాలుల ప్రభావం మూడునాలుగు రోజుల వరకు ఉంటాయని, మరో మూడు డిగ్రీలు తగ్గే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొంటున్నారు. అత్యవసర పనులుంటేనే రక్షణ కవచాలు ధరించే బయటకు వెళ్లాలని, ఇంటివద్ద ఉండడమే శ్రేయస్కరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గోరువెచ్చని నీరు తాగాలని వివరిస్తున్నారు. చలి నుంచి రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటున్నారు.