వికటించిన ఆహారం

గ్రామంలోనూ వైద్యశిబిరం ఏర్పాటు



 జైనథ్‌, : జైనథ్‌ మండలంలోని పెండల్‌వాడ గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం దాజీనగర్‌లో ఆహారం వికటించి సుమారు వంద మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో శుక్రవారం ఓ ఇంట్లో గురుపూజ నిర్వహించారు. తెల్లవారుజామున వరకు భజన కార్యక్రమాలు చేపట్టారు. శనివారం ఉదయం అన్నదానం నిర్వహించగా 500 మంది వరకు గ్రామస్థులు శుక్రవారం రాత్రి వండిన భోజనాలు చేశారు. రాత్రి కొంత మంది ఎవరి ఇంట్లో వారు అస్వస్థతకు గురికాగా ఆదివారం ఉదయం ఒక్కొక్కరుగా ఇలా దాదాపు వంద మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. సమాచారాన్ని ఎంపీటీసీ సభ్యుడు కాసర్ల అశోక్‌, తెరాస నాయకుడు జంగిలి సురేష్‌లు 108కు సమాచారం అందించారు. బాధితులు 40 మందిని రిమ్స్‌కు తరలించగా, మరో పది మంది వరకు జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సలు పొందారు. మరి కొంతమందిని స్థానికంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్సలు అందించారు. వైద్యశిబిరానికి జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి తొడ్సం చందు, జిల్లా ఉప వైద్యారోగ్యశాఖాధికారి పి.సాధన, గిమ్మ, జైనథ్‌, భీంపూర్‌ వైద్యులు సమంత్‌కుమార్‌, దీపిక, సూరత్‌లు సిబ్బందితో చేరుకొని స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో బాధితులకు చికిత్సలను అందించారు. 108 వాహనాల్లో తొలుత 35 మందిని ఆ తర్వాత మరో అయిదుగురిని రిమ్స్‌కు తరలించారు. మిగతా వారిని తరలించేందుకు 108 వాహనాలు అందుబాటులో లేకపోవడంతో ఆటోల్లో తరలించేందుకు రూ.2 వేలు నగదును వైస్‌ ఎంపీపీ విజయ్‌కుమార్‌ అందజేసి సాయం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఉప తహసీల్దార్‌ రాజేశ్వరి, ఆర్‌ఐ ప్రసాద్‌, ఎస్‌ వెంకన్నలు వైద్య శిబిరానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.