రక్తదానంతో ప్రాణదానం


సిరిసిల్లపట్టణం: రక్తదానం ప్రాణదానంతో సమానమని.. స్వచ్ఛందంగా రక్తదానం చేయడమనేది ప్రతి ఒక్కరూ సేవగా కాకుండా బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అన్నారు. సిరిసిల్లలోని పొదుపుభవన్‌లో అధికారుల సంఘం(డోర్స్‌) ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన రక్తదాన శిబిరానికి కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రక్తదాన ఆవశ్యకతను తప్పనిసరిగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ రక్తదానం చేసే  గొప్పగుణాన్ని అలవర్చుకోవాలని, ప్రతి ఒక్కరూ మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి గౌతమ్‌రెడ్డి,  డీపీఆర్వో మామిండ్ల దశరథం, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.