విద్యార్థులకు పౌష్టికాహారం తప్పనిసరి


సిద్దిపేట : వయసులో విద్యార్థులు పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలని తెలంగాణ పిడియాట్రిక్‌ అకాడమీ జిల్లా ఫెసిలిటేటర్‌ డాక్టరు శ్రవణ్‌కుమార్‌ సూచించారు. బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ నూతనోన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ...పౌష్టికాహార లేమితో విద్యార్థుల్లో శారీరక రుగ్మతలు ఏర్పడుతున్నాయన్నారు. ఈ అంశంపై ఉపాధ్యాయులు కూడా పిల్లలకు అవగాహన కల్గించాలని సూచించారు. వ్యక్తిగత శుభ్రత కూడా కీలకమని అన్నారు. భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలని, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. జీవితంపై సరైన అవగాహన కల్గి ఉండాలన్నారు. మానసిక ఒత్తిడికి లోను కాకూడదన్నారు. సామాజిక మాధ్యమాలు విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, వాటికి దూరంగా ఉండడం ఉత్తమం అన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ సత్తా చాటాలన్నారు. ఈ సందర్భంగా బాలల హక్కుల గురించి వివరించారు. కార్యక్రమంలో డీసీపీఓ రాము, ప్రతినిధి నర్సింలు పాల్గొన్నారు.