సూర్యారావుపేట : వై.ఎస్.ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా పొందిన ఆర్థిక సాయాన్ని వాహనానికి బీమా కట్టేందుకు, వాహన మరమ్మతులకు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ.ఎం.డి.ఇంతియాజ్ పేర్కొన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం వాహనమిత్ర పథకం కింద రెండో విడత ఆర్థిక సాయాన్ని డ్రైవర్లకు ఆయన అందించి మాట్లాడారు. జిల్లాలో వై.ఎస్.ఆర్ వాహనమిత్ర పథకం కింద రెండో విడతలో 6,512 మంది దరఖాస్తు చేసుకోగా 6,337 మందికి మంజూరు చేసినట్లు వివరించారు. కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు ఎవరి పేరు మీద వాహనం రిజిస్టర్ అయి ఉన్నా దీనికి అర్హులుగా గుర్తిస్తున్నామన్నారు. ఈ పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆర్థిక సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని, ఇంకా జమ కాని వారు వెంటనే డీటీసీ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను కలెక్టర్ అందించారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత, ఉపరవాణా కమిషనర్ ఎస్.వెంకటేశ్వరరావు, మోటారు వాహనాల తనిఖీ అధికారి రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు.