పదేళ్లుగా పూరిగుడిసెలో యువకుడు మంచానికే పరిమితం
సపర్యలు చేస్తున్న కుటుంబం
కొలాం గిరిబిడ్డ వేదన
మానిక్‌రావు పరిస్థితిని వివరిస్తున్న తండ్రి చిన్ను
నరాల వ్యాధితో రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. పింఛను రాదు, వీల్‌చైర్ లేదు. ఆసుపత్రులకు వెళ్లాలంటే డబ్బులుండవు. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. ఎంతో చదువుకుని గిరి యువతకు మేలు చేయాలనుకున్న యువకుడు కన్న కలలు ఆవిరయ్యాయి. మాయరోగం బారిన పడి పదేళ్లుగా మంచానికే పరిమతమయ్యారు. నలుగురు సంతానంలో ఒకరినైనా చదివిద్దామనుకున్నా కన్నవాళ్ల ఆశలూ కల్లలయ్యాయి. సిరికొండ మండలంలో కాళ్లు చచ్చుబడిపోయి దీనస్థితిలో ఉన్న యువకుడిపై కథనం.
సిరికొండ: సిరికొండ మండలం కొలాంగూడలోని మానిక్‌రావు అనే యువకుడు గ్రామానికి చెందిన బాగుబాయి, చిన్నుల కుమారుడు. ఈయన 10 ఏళ్ల కిందట పదోతరగతి పూర్తి చేశారు. అంతలోనే కాలికి చిన్నపాటి గాయం కావడంతో పలు ఆసుపత్రులు తిరిగారు. పుండుగాయం మానినా కాలు కుచించుకోవడం ప్రారంభమైంది. ఇలా ఒక కాలుతో మొదలై రెండో కాలికి చేరింది. మోకాలివరకు రెండు కాళ్లు సన్నబడ్డాయి. అంతలోనే పలు ఆసుపత్రులకు వెళ్లినా నయం కాకపోవడంతో ఏళ్లుగా ఆయనను ఓ గుడిసెలో ఉంచారు. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. మొదట్లోనే డబ్బులు పూర్తిగా ఖర్చు చేయడంతో ఆర్థికస్థోమత లేక ఇంట్లోనే ఉంచే పరిస్థితి నెలకొందని మానిక్‌రావు తండ్రి చిన్ను పేర్కొన్నారు. పూరిగుడిసెలోనే ఉంచి ఎప్పటికప్పుడు ఆహారం అందిస్తున్నారు. నానాటికీ ఆరోగ్యం క్షీణిస్తోంది. ఇంతటితోనే కాకుండా అతని కాలు నుంచి మెడకాయ వరకు దేహం వంకరగా మారింది. నరకయాతన అనుభవిస్తున్నారు ఆ యువకుడు. పదేళ్లుగా బాహ్యప్రపంచానికి దూరంగా పూరి గుడిసెలోనే ఉంటున్నారంటే పరిస్థితి ఏ తీరుగా ఉందో అర్థం చేసుకోవచ్ఛు కనీసం ప్రభుత్వ పింఛను రావడం లేదు. కనీసం కూర్చొవడానికి వీల్‌చైర్ లేదు. సాంకేతిక రంగంలో దూసుకుపోతున్న ప్రస్తుత తరంలో కనీస అవగాహన లేకపోవడంతో వారి బతుకులు చీకట్లోనే మగ్గుతున్నాయి అనడానికి ఇతని దీనగాథే సాక్ష్యం. 'న్యూస్‌టుడే' యువకుడితో మాట్లాడగా.. అతనికి కన్నీరు తప్ప మాట రాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రావద్దంటూ కన్నీరుమున్నీరయ్యారు. పూర్తి స్థాయిలో నాణ్యమైన వైద్యం అందిస్తే అతనికి మరోజన్మనిచ్చినట్టే అవుతుంది. దాతలెవరైనా ఆదుకొని సాయం చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.