శేఖరంబంజర ప్రభుత్వ ఆసుపత్రికి కేంద్రం అవార్డు ప్రదానం

 

 



పాల్వంచ : మెరుగైన వైద్యంతో పాటు రోగులకు సరైన సౌకర్యాలు కల్పిస్తున్న పాల్వంచలోని శేఖరంబంజర పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం 'ఎన్‌క్వాస్‌' (నేషనల్‌ క్వాలిటీ ఎష్యూరెన్స్‌ స్టాండర్డ్‌) అవార్డును ప్రకటించింది. హైదరాబాద్‌లోని వైద్య విధాన పరిషత్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, కమిషనర్‌ యోగితా రాణా, శాంతికుమారి చేతుల మీదుగా ఆసుపత్రి వైద్యుడు డా.నామ బుచ్చయ్య అవార్డును అందుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి, మే నెలల్లో కేంద్ర బృందం ఆసుపత్రిని సందర్శించింది. రోగుల సౌకర్యార్థం తాగునీరు, సహాయకులు కుర్చునేందుకు కుర్చీలు, బల్లలు, వాహనాల పార్కింగ్‌ సదుపాయం, మరుగుదొడ్లు, జీవ వ్యర్థాల నిర్వహణ, ల్యాబ్‌, ఓపీ నమోదు, గర్భిణులకు ప్రత్యేక గది, రికార్డుల నిర్వహణ సహా మొత్తం 12 రకాల విభాగాలను నిశితంగా పరిశీలించింది. అనంతరం ప్రతిష్ఠాత్మక ఎన్‌క్వాస్‌ అవార్డుకు శేఖరంబంజర యూపీహెచ్‌సీ ఎంపికైనట్లు జిల్లా క్వాలిటీ మేనేజరు శ్రుతి తెలిపారు. మొదటి ఏడాది రూ.2 లక్షలు, మిగతా రెండేళ్లు రూ.3 లక్షలు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు ఆమె ఈ సందర్భంగా చెప్పారు.