దోమల కాయిల్‌ కాటేయబోయింది!


చీరకు నిప్పంటుకుని మహిళకు గాయాలు


జూబ్లీహిల్స్‌ : దోమల కాయిల్‌ వెలిగిస్తుండగా చీరకు నిప్పంటుకొని ఓ మహిళకు తీవ్ర గాయాలైన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకొంది. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 13లో నివసించే నుస్రత్‌ సుల్తాన్‌ బేగం(28) బుధవారం రాత్రి ఇంట్లో దోమల కాయిల్‌ను అగ్గిపెట్టెతో వెలిగించే క్రమంలో ఆమె చీరకు నిప్పంటుకుంది. దీన్ని ఆమె గమనించలేదు. కొద్దిసేపటికి మంటలు పెరిగి వాసన రావడంతో గమనించగా చీరకు నిప్పంటుకోవడం కనిపించింది. గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న ఆమె భర్త మహబూబ్‌ నీళ్లు పోసి మంటలు ఆర్పే ప్రయత్నం చేశాడు. 108, పోలీసులకు సమాచారం అందించారు. గాయాలపాలైన నుస్రత్‌ సుల్తాన్‌ బేగంను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి స్థిమితంగానే ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.