కొణిజర్ల : ఈత సరదా ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఈతకోసం కాల్వలో దిగి ఇద్దరు ఫార్మసి విద్యార్థుల్లో ఓ విద్యార్థి గల్లంతు కాగా మరొకరిని సమీపంలో ఉన్న అయ్యప్ప మాలధారులు కాపాడారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల సమీపంలోని బోనకల్ బ్రాంచ్ కెనాల్ కాల్వలో గురువారం జరిగింది. ఎస్‌ఐ ఎల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామానికి చెందిన భూక్య బాలకిషన్, అరుణ దంపతులు పెద్ద కుమారుడు భూక్య కల్యాణ్(19), అదే జిల్లా డోర్నకల్ మండలం వినరమ్ గ్రామానికి చెందిన దేవన్ నెహ్రునాయక్, ఖమ్మం జిల్లా కల్లూరు మండలం, రావికంపాడు గ్రామానికి చెందిన మార్త గోపాలరావు ముగ్గురు స్నేహితులు. వీరు ఖమ్మంలోని ఓ హాస్టల్‌లో ఉంటూ తనికెళ్ల సమీపంలోని బ్రౌన్స్ ఫార్మసీ కళాశాలలో ఫార్మ-డీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. గురువారం ఉదయం ముగ్గురు కలిసి తనికెళ్ల గ్రామ సమీపంలోని బోనకల్ బ్రాంచ్ సాగర్ కాల్వ వద్దకు ఈత కోసం వచ్చారు. వారిలో కల్యాణ్, నెహ్రునాయక్ ఇద్దరు కాల్వలోకి దిగి ఈతకొడుతున్నారు. వారితో పాటు వచ్చిన గోపాలరావు వారిని ఒడ్డున ఉండి సెల్‌లో వీడియో తీస్తున్నాడు. అలా కొంతదూరం వచ్చిన ఇద్దరిలో కల్యాణ్ మునిగిపాగా, నెహ్రునాయక్ మునిగితేలుతున్నాడు. అది గమనించిన గోపాలరావు పెద్దగా కేకలు వేశాడు. అరుపులు విని దగ్గరలోనే స్నానం చేస్తున్న అయ్యప్ప మాలధారులు రామకృష్ణ, బంగారయ్య పరుగున వెళ్లి నెహ్రునాయక్‌ను కాపాడారు. కల్యాణ్ మాత్రం అప్పటికే గల్లంతయ్యాడు. ఈతగాళ్లతో గాలింపు చేపట్టినా రాత్రి వరకు కూడ ఆచూకీ లభించలేదని, ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ కమల, వీఆర్వోలు నాగేశ్వరరావు, ఆశయ్య, బ్రౌన్స్ కళాశాల పరిపాలనాధికారి హన్మంతరావు, భోదన సిబ్బంది, కళాశాల చైర్మన్ పారుపల్లి ఉషాకిరణ్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
కాగా స్నేహితులను అప్పటి వరకు వీడియోలు తీసిన గోపాల్‌రావు కల్యాణ్ మునిగిపోయాడని కళ్ల ముందే చూడటంతో సృహకోల్పోయాడు. నెహ్రునాయక్, గోపాల్‌రావులను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. తన కుమారుడు కాల్వలో గల్లంతైయ్యాడని తెలుసుకున్న కల్యాణ్ తండ్రి బాలకిషన్ బంధువులతో కలిసి కాల్వవద్దకు చేరుకున్నాడు. రాత్రి వరకు కూడా కుమారుడి జాడ కోసం ఎదురు చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు.