బిడ్డ ఎలా ఉందో..?


ఖమ్మం: 'నా బిడ్డ ఎలా ఉందో. ఆరోగ్యం ఎలా ఉందో..? వైద్యం అందిస్తున్నారో...? లేదో..?. అసలు నా బిడ్డ ఎక్కడ ఉందో..? ఆచూకీ ఎప్పుడు దొరుకుతుందో..?' అంటూ తన చిన్నారి కోసం కన్నీరింకిన కళ్లతో ఎదురు చూస్తోంది చలం రమాదేవి. ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో మూడు రోజుల క్రితం అపహరణకు గురైన తన 16నెలల కూతురు కోసం రోదిస్తోంది. అసలే ఆరోగ్యం సరిగా లేని తన బిడ్డ ఇప్పుడు ఎక్కడ ఉందో..? ఎలా ఉందోనంటూ కనిపించిన అధికారినల్లా ఆరా తీస్తోంది. తన వద్దకు వచ్చే ప్రతీ ఒక్కరిని చూసి.. తనకు తీపి కబురు చెబుతరామోనని ఎదురుచూస్తోంది. మంగళవారం ఉదయం 6.40గంటల సమయంలో జిల్లా ఆసుపత్రి నుంచి శిశువును గుర్తు తెలియని ఆరుగురు పక్కా ప్లానింగ్‌తో అపహరించిన సంఘటన తీవ్ర సంచలనం రేపగా.. ఆ చిన్నారి ఆచూకీ గురువారం కూడా దొరకలేదు. మూడు బృందాలుగా ఏర్పడిన పోలీసులు గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఇప్పటికే సీసీ ఫుటేజీలను పరిశీలించిన అధికారులు, పోలీసులు శిశువును అపహరించిన వారి ఫొటోలు, వాహనాల కదలికలను, పోన్‌కాల్‌ డేటాలను సేకరించినట్టు తెలుస్తోంది.

 

శిశువు ఆరోగ్యంపై ఆందోళన..

ఈనెల 9న వేంసూరుకు చెందిన చలం రమాదేవికి కాన్పు కాగా బిడ్డ బరువు తక్కువగా ఉండటంతో పాటు శ్వాసకోశ సమస్య కారణంగా ఖమ్మం ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. తర్వాత 16వ రోజువరకు ఎస్‌ఎన్‌సీయూలో వైద్యసేవలు అందించిన వైద్యులు.. శిశువు ఆరోగ్యం కుదుటపడటంతో తల్లిచెంతకు చేర్చారు. ఈ క్రమంలో వారి నుంచి శిశువును గుర్తుతెలియని మహిళ మరో ఐదుగురిసాయంతో అపహరించింది. అయితే ఆ శిశువు ఆచూకీ మూడురోజులుగా తెలియకపోవడంతో అసలు ఆ చిన్నారి ఎక్కడ ఉంది..? ఆరోగ్యం ఎలా ఉంది..? అనే దానిపై అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఎక్కడైనా తల్లి పాలు పట్టించి, వైద్యులకు చూపిస్తే ఆరోగ్యానికి ఢోకా ఉండదని డాక్టర్లు చెబుతున్నారు. ఆసుపత్రి నుంచి శిశువు అపహరణ జరిగి మూడు రోజులైనా కనీస అచూకీ తెలియకపోవటంతో జిల్లా ఆసుపత్రిలో ఉన్న 150మంది బాలింతలు వారి శిశువుల విషయంలో భయంతో వణికిపోతున్నారు. బంధువుల అండతో పిల్లల పడకల వద్ద కాపాలా ఉంటున్నారు. ఇదే క్రమంలో జిల్లా ఆసుపత్రికి వైద్యసేవల కోసం వచ్చే తల్లులు, పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు ఓపీ రికార్డులు నమోదు జరిగాయి.