నిమ్స్‌లో రేడియేషన్‌ ఆంథాలజీ విభాగం ప్రారంభం


పంజాగుట్ట, హైదరాబాద్‌: నిమ్స్‌ ఆసుపత్రిలోని రేడియేషన్‌ ఆంథాలజీ విభాగంలో ఆధునికీకరించిన స్త్రీ, పురుషుల వార్డులను అంతర్జాతీయ లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు జంగ్‌ యూచాయ్‌, క్లబ్‌ ప్రతినిధి లయాన్‌ షెంగ్‌బోక్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా లయన్స్‌ క్లబ్‌ క్యాన్సర్‌ రోగులకు చేయూతనిచ్చేందుకు రూ.50లక్షల వ్యయంతో ఈ విభాగాన్ని ఆధునికీకరించిందన్నారు. అనంతరం ఈ వార్డుల్లో స్త్రీ, పురుషులకు కలిపి 36 పడకలు అందుబాటులో ఉంటాయని నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మనోహర్‌ తెలిపారు. నిమ్స్‌లోని ఈ రేడియేషన్‌ ఆంథాలజీ భవనాన్ని 1990వ సంవత్సరంలో లయన్స్‌ క్లబ్‌ వితరణ నిధులతో నిర్మించారన్నారు. లయన్స్‌ క్లబ్‌ సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో నిమ్స్‌కు లినీయర్‌ ఎక్స్‌క్లేటర్‌ యంత్రాన్ని సమకూర్చాలని డాక్టర్‌ మనోహర్‌.. జాంగ్‌యూచాయ్‌ను కోరగా.. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. అనంతరం లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు క్యాన్సర్‌ విభాగంలోని పలు వార్డులను సందర్శించారు. లుకేమియా క్యాన్సర్‌ సేవల్లో సైన్స్‌ ఎంతో అభివృద్ధి చెందిందని తద్వారా రోగులకు మెరుగైన సేవలు అందుతున్నాయని వారన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్స్‌ పరిపాలనాధికారి డాక్టర్‌ కృష్ణారెడ్డి, లయన్స్‌ క్లబ్‌కు చెందిన పలు శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.