దయా’లసిస్‌ లేదయ..!


ఆరోగ్యశ్రీలో డయాలసిస్‌ సేవలకు విముఖత


భీమవరంలో చేతులెత్తేసిన ప్రైవేటు ఆసుపత్రులు


రోగుల కుటుంబ సభ్యుల ఆందోళన


భీమవరం : జిల్లాలో మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న రోగులకు డయాలసిస్‌ సేవలు అందించటం ఒక ప్రహసనంలా మారింది. డెల్టా ప్రాంతంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్‌ కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమైంది. వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీలో పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉన్నా వాటిలో వైద్యసేవలు నిలుపుదల చేస్తామని కొందరు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో మూత్రపిండాల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వందలాది మంది రోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు సైతం ఆందోళన చెందుతున్నారు.


జిల్లాలోని ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, జంగారెడ్డిగూడెంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని డయాలసిస్‌ కేంద్రాల్లో నిత్యం 363 మందికి చికిత్స అందించే సదుపాయం ఉండగా మరిన్ని యూనిట్‌లు అందుబాటులో ఉంటేగాని రోగులకు పూర్తిస్థాయిలో వైద్యం అందే అవకాశం ఉండదు. జిల్లాలో అవసరం మేరకు డయాలసిస్‌ కేంద్రాలు లేకపోవటంతో ఎక్కువ మంది రోగులు ఇతర జిల్లాల్లోని ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది.


ప్రతిపాదనలకే పరిమితం.. డెల్టా ప్రాంతంలో ఇటీవల కాలంలో డయాలసిస్‌ వ్యాధి బారిన పడుతున్నవారు అధికంగా ఉంటున్నారు. మధుమేహం, రక్తపోటు, అధికంగా ఔషధాలు వాడేవారు మూత్రపిండాల సంబంధిత వ్యాధులకు గురవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీంతో ఆర్థిక స్థోమత లేనివారు ఎక్కువగా వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీపైనే ఆధారపడుతున్నారు. భీమవరం, నరసాపురం, కొవ్వూరు, పాలకొల్లులోని ప్రభుత్వాసుపత్రుల్లో డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కొన్నేళ్ల కిందటే ప్రతిపాదనలు సిద్ధం చేసినా కార్యరూపం దాల్చలేదు.


వ్యయ.. ప్రయాసలు


డెల్టాప్రాంతంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏ ఒక్కచోటా డయాలసిస్‌ సేవలు అందుబాటులో లేవు. భీమవరం పట్టణంలోని వర్మ, ఇంపీరియల్‌ ఆసుపత్రుల్లో డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకంలో సేవలందిస్తున్నారు. ఈ రెండు ఆసుపత్రుల్లో ఇప్పటికే 226 మంది సేవలు పొందుతున్నవారు ఉండగా ఆయా ఆసుపత్రుల్లో డయాలసిస్‌ సేవలు నిలుపుదల చేస్తామని సంబంధిత యాజమాన్యాలు స్పష్టం చేశాయి. ఇక్కడికి వచ్చే రోగులను ఏలూరు, తాడేపల్లిగూడెం వంటి ప్రాంతాలకు తీసుకెళ్లాలరటే వ్యయ, ప్రయాసలు తప్పవని బాధిత కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఒక్కోరోగికి వారానికి రెండు రోజులు.. కొందరికి వారానికి ఒకసారి డయాలసిస్‌ చేయాల్సి ఉంటుందని, ఈ పరిస్థితుల్లో డయాలసిస్‌కు తీసుకెళ్లడం కష్టం అవుతుందని చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన డయాలసిస్‌ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న ఒక్కోరోగికి రూ.980 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.2,500 వరకు వసూలు చేస్తుండటంతో ఆర్థిక స్థోమత లేనివారు ఆందోళన చెందుతున్నారు.


భారీ వ్యయం...


పది యూనిట్ల డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటుకు రూ.1.5 కోట్లు ఖర్చు అవుతుంది. దాతల సౌజన్యంతో కొంత సమకూరితే మరికొంత మొత్తం ప్రభుత్వం అందజేసే అవకాశం ఉంది. చికిత్స అందించే పరికరం రూ.6లక్షలు ఉంటుందని, యూనిట్‌ ఏర్పాటుకు అవసరమైన ఇతరత్రా వసతులు, ఏసీ పరికరాలు బిగింపునకు కలిపి రూ. 1.5 కోట్లు అవుతుందని వైద్యులు చెబుతున్నారు. 10 యూనిట్ల కేంద్రంలో నాలుగు షిఫ్టుల్లో 100 మందికి తగ్గకుండా సేవలందించే అవకాశం ఉంటుందంటున్నారు. నరసాపురం, పాలకొల్లు, భీమవరం తదితర ప్రాంతాల రోగులకు భీమవరంలోనే డయాలసిస్‌ సేవలు అందుబాటులోకి తీసుకొస్తే ఉపయుక్తంగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.


ఉప ముఖ్యమంత్రి దృష్టికి..


డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు విషయాన్ని ఉప ముఖ్యమంత్రి, వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని దృష్టికి తీసుకెళ్తాం. ప్రస్తుతం భీమవరంలో నెలకొన్న పరిస్థితులను కూడా వివరిస్తాం. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న రోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం.


- డాక్టర్‌ కె.శంకరరావు, జిల్లా ఏరియా ఆసుపత్రుల సమన్వయాధికారి


జిల్లాలో పరిశీలిస్తే..


ప్రభుత్వాసుపత్రి              నిత్యం సేవలు పొందే రోగుల సంఖ్య


ఏలూరు                                 73


తాడేపల్లిగూడెం                          150


తణుకు                                 60


జంగారెడ్డిగూడెం                         80