- జిల్లాలోనే బయటపడిన తొలి ఎయిడ్స్ కేసు
- హెచ్‌ఐవీ నిరోధంలో సిరిసిల్ల జిల్లాలో సత్ఫలితాలు
- జిల్లాలో 1792 మంది హెచ్‌ఐవీ బాధితులు
- 900 మందికి పింఛన్లు, మిగతా వారికి ఎదురుచూపులు
- సిరిసిల్ల ఎఆర్‌టీ కేంద్రం నుంచి మందులు పొందుతున్నవారు 340 మంది
- జిల్లాలో నోడల్ కేంద్రం లేక ఇబ్బంది
- నేడు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం
సిరిసిల్ల: ప్రాణాంతకమైన ఎయిడ్స్ వ్యాధికి శాశ్వత పరిష్కారం లేదు. మందులతో జీవితాన్ని పొడగించుకునే వీలు మాత్రమే ఉంది. సిరిసిల్ల జిల్లాలో గతంతో పోల్చుకుంటే హెచ్‌ఐవీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. లెక్కల శాతాల్లో తగ్గుతున్నట్లుగా కనిపిస్తున్నా చాపకింద నీరులాగా ఈవ్యాధి విస్తరిస్తూ భయపెడుతూనే ఉంది. దాదాపు మూడు దశాబ్దా ల క్రితమే రాష్ట్రంలోనే సిరిసిల్లలో మొదటిసారిగా లక్ష్మీ అనే మహిళ ఎయిడ్స్‌తో మృతిచెందడం సంచలనమైంది. ఆ తరువాత ప్రత్యేక దృష్టిని సారించారు. 2011లో జిల్లాలో 7.5 శాతం హెచ్‌ఐవీ కేసులుండగా.. ప్రస్తుతం 2.68 శాతానికి తగ్గింది. కానీ కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టకపోవడం ఆందోళన కలిగిస్తున్న విషయం. మరోవైపు కొంత వైద్యం అందుబాటులోకి వచ్చినా బంధువులు, సమాజం చూపే చులకన భావన వివక్షతను చూసి నిశబ్ధంగా ప్రాణాలను వదిలించుకుంటున్నారు. నిశబ్ధం చేధిస్తే హెచ్‌ఐవీ సోకిన వారు కూడా కొంత జీవితాన్ని పొడిగించుకునే అవకాశం ఉంది. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని లింక్ ఏఆర్‌టీ కేంద్రంలో ప్రతి సంవత్సరం 120 మంది వరకు హెచ్‌ఐవీ సోకిన వారు బయటకు వస్తున్నారు.
వలసల వల్ల వ్యాపిస్తున్న హెచ్‌ఐవీ
జిల్లాలో ప్రధానంగా ఉపాధివేటలో వలసలు వెళుతున్న వారికే హెచ్‌ఐవీ సోకుతోంది. అది జిల్లాలో వ్యాప్తి చెందు తోందని భావిస్తున్నారు. జిల్లాకేంద్రంలో మొదట నేత కార్మికులు భీవండీ, ముంబై, సూరత్ లాంటి ప్రాంతాలకు మరమగ్గాలను నమ్ముకొని వలస వెళ్లి అక్కడ చీకటి సరదాల తో హెచ్‌ఐవీని కొనితెచ్చుకుంటున్నారు. రోగాల బారిన పడుతున్నారు. కరువు పరిస్థితుల్లో ఎవసం లేక గల్ఫ్ దేశాలకు, ముంబై లాంటి నగరాలకు వెళ్లి కూలీ పనులు చేస్తున్న వారు క్షణికావేశంలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్ లాంటి రోగాలకు బలవుతున్నారు. వారు చేసిన చిన్న పొరపాటుకు కుటుంబంలోని మహిళలు, పిల్లలు కూడా భయంకరమైన వ్యాధితో చావుతో పోరాటం చేస్తున్న సందర్భాలు జిల్లాలో ఉన్నాయి.
నిశ్శబ్ధాన్ని ఛేదించాలి...
హెచ్‌ఐవీ సోకిందని నిశ్శబ్ధంగా ఉండడం కంటే ఏఆర్‌టీ కేంద్రాన్ని సంప్రదించి మందులు వాడుకోవాలి. హెచ్‌ఐవీ నివారించలేకపోయినా జీవిత కాలాన్ని పొడిగించుకునే అవ కాశం ఉంటుంది. హెచ్‌ఐవీ సోకిన వారికి కౌన్సెలింగ్ ఎంతో ఉపయోగపడుతుంది. కౌన్సెలింగ్ ద్వారా హెచ్‌ఐవీ సోకిన వారికి మనోనిబ్బరం కలుగుతుంది. హెచ్‌ఐవీ అంటువ్యాధి కాదన్నది మిగతా వారికి అవగాహన కల్పించాలి. హెచ్‌ఐవీ పై కౌన్సెలింగ్ లేకపోతే ఆ వ్యక్తుల మానసిక స్థితి చాలా విలక్షణంగా మారిపోతుంది. రోగి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆత్మహత్యలు, డిప్రెషన్, కుటుంబ కలహాలు, ఇంటి నుంచి పారిపోవడం, మనస్పర్థలు, అపోహలతో అనర్థాలు తెచ్చిపెట్టుకోవడం చేస్తారు.
పదేళ్లలో 92,170 మందికి పరీక్షలు 1719 మందికి పాజిటివ్
జిల్లాలో గడిచిన ఏడేళ్లలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఎయిడ్స్ కంట్రోల్ కేంద్రంలో 92,170 మంది పురుషు లు, మహిళలతో పాటు, గర్భిణులకు పరీక్షలు నిర్వహించగా 1719మందికి హెచ్‌ఐవీ పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిం ది. జిల్లాలో లెక్కలు చూస్తే హెచ్‌ఐవీ రోగులు తగ్గినట్లుగానే కనిపిస్తోంది. 2011లో 2717 మందికి పరీక్షలు జరిపితే 204 మంది హెచ్‌ఐవీ పాజిటివ్ రాగా.. 2012లో 3197 మందిలో 211 మంది, 2013లో 4389 మందిలో 181 పాజిటివ్, 2014లో 4498 మందికి 212 పాజిటివ్, 2015లో 4569 మందికి 186 మంది పాజిటివ్, 2016లో 4331 మందికి 152 పాజిటివ్, 2017లో 3727 మందికి 152మంది పాజిటివ్, 2018లో 4993 మందికి 139 మంది పాజిటివ్‌గా ఉన్నారు. ఈ సంవత్సరం నవంబర్ 30 వరకు 4736 మందికి పరీక్షించగా 127 మంది పాజిటివ్‌గా గుర్తించారు. 3955మంది గర్భిణులను పరీక్షించగా ఇద్దరికి హెచ్‌ఐవీ బయటపడింది. ఇందులో 2011లో 7.5 శాతం, 2012లో 6.5 శాతం, 2013లో 4.12శాతం, 2014లో 4.71 శాతం, 2015లో 4.07 శాతం, 2016లో 3.50 శాతం 2017లో 3శాతం, 2018లో 2.90 శాతం 2019లో 2.50 శాతంగా ఉంది. సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో ఉన్న ఎఆర్‌టీ కేంద్రంలో ప్రతీనెలా 10 నుంచి 12 కేసులు పాజిటివ్‌గా తేలుతున్నాయి.ప్రస్తుతం నెలకొన్న ప్రమాద ఘంటికలు జిల్లా లో ఆందోళనలు కలిగిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో ఏయిడ్స్ కంట్రోల్ నోడల్ కేంద్రం లేకపోవడంతో హెచ్‌ఐవీ పాజిటివ్ రోగులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో లిం క్ ఏఆర్‌టీ సెంటర్ వల్ల డాక్టరును సంప్రదించడం కోసం మళ్లీ కరీం నగర్‌కు వెళ్లాల్సి వస్తోంది.
కౌన్సెలింగ్‌లో ముఖ్యంగా గమనించాల్సినవి..
కౌన్సెలింగ్ చేసే ముందు ఆ వ్యక్తికి హెచ్‌ఐవీ ఉందనే విష యాన్ని చాలా జాగ్రత్తగా సున్నితంగా తెలియజేయాలి. మానసిక పరిస్థితి తగిన విధంగా అంచనా వేయాలి. చక్కని స్నేహపూర్వ వాతావరణాన్ని ఏర్పరుచుకోవాలి. హెచ్‌ఐవీ ఉన్న వ్యక్తికి అనేక రకాల భయాలు, అనుమానాలు ఉంటా యి. వాటిని ఎప్పటికప్పుడు వివరణ ఇవ్వాలి. హెచ్‌ఐవీ రోగికి సరైన సమాచారం తెలుసుకోవడం కోసం అవకాశం కల్పించాలి.
ఆరోగ్య విషయాలపై...
హెచ్‌ఐవీ ఎయిడ్స్ రోగికి ఆరోగ్య విషయాలపై కౌన్సెలింగ్ చేసేటప్పుడు ముందుగా ఎయిడ్స్‌పై సమగ్ర సమాచారాన్ని అర్థం చేయించాలి. వ్యాధి లక్షణాలు ఏ విధంగా బయట పడుతాయో తెలియజేయాలి. ఆరోగ్యరక్షణలో శారీరక, మా నసిక విశ్రాంతి గురించి తెలియజేయాలి. మానసిక ఒత్తిడి వల్ల వ్యాధి పెరుగుతుందని వివరించాలి. రోగ నిరోధకశక్తిని పెంచుకోవడానికి పౌష్టికాహారం పాలు, గుడ్లు, తాజా కూర గాయలు, పండ్లు తీసుకునే విధంగా అవగాహన కల్పించాలి. మద్యపానం, దుమపానం, జర్ధా, పాన్, మొదలైనవి ఎంత నష్టం కలిగిస్తాయో వివరించాలి.
కుటుంబ సభ్యుల నుంచి ఆదరణ ముఖ్యం...
హెచ్‌ఐవీ సోకిన వ్యక్తికి కుటుంబ సమస్యలు కూడా ఎదురవుతాయి. పెళ్లి, ఆర్థికస్థితి, వ్యాపారం, ఉద్యోగం, వైద్యం లాంటివి కీలకమవుతాయి. హెచ్‌ఐవీ సోకిన వ్యక్తి ఇంటికి పోషణకు ముఖ్యమైన వ్యక్తి అయితే ఆర్థిక స్థితిని గమనిం చాలి. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. హెచ్‌ఐవీ రోగులకు అద్దె ఇల్లు దొరకడం కూడా కష్టమే. ఇటువంటి విషయంలో కూడా ఇంటి వాళ్లకు కౌన్సె లింగ్ చేయాలి. విద్యార్థులకు ఆరోగ్యవిషయాలు చెప్పి చదు వుకునే విధంగా ప్రోత్సహించాలి. పెళ్లికి ముందు ఇతరులతో లైంగిక సంబంధాలు ఉంటే హెచ్‌ఐవీ టెస్ట్ చేయించుకోవా లని సూచించాలి. హెచ్‌ఐవీ ఉన్నవారు పిల్లలు కనక పోవ డం మంచిది. హెచ్‌ఐవీ ఉన్న గర్భిణి ప్రభుత్వ ఆసుపత్రిలోని ఫ్రివెన్షన్ పేరెంట్ టూ చైల్డ్ ట్రాన్స్ మిషన్ సెంటర్‌లోనే డాక్ట ర్ పర్యవేక్షణలో ప్రసవించాలి. నాటు వైద్యాలకు వెళ్లవద్దు.
ముందుకు వస్తున్న స్వచ్ఛంద సంస్థలు...
హెచ్‌ఐవీ పాజిటివ్ బాధితులకు పలు స్వచ్ఛంధ సంస్థలు భరోసా కల్పిస్తూ ముందుకు వస్తున్నాయి. అగ్రహారం వద్ద ఒక స్వచ్ఛంద సంస్థ ప్రత్యేకంగా పిల్లలను అక్కున చేర్చుకొని వారికి సేవలు అందిస్తున్నారు. సిరిసిల్లలోని కంటి వైద్య నిపుణులు డాక్టర్ మురళీ కృష్ణ ప్రతినెలా బాధిత కుటుం బాలకు అవసరమయ్యే పౌష్టికాహారం భోజన వసతికి అవస రమయ్యే వస్తువులను అందిస్తున్నారు.
యువతలో చైతన్యం రావాలి... డాక్టర్ తిరుపతి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెండ్
జిల్లాలో హెచ్‌ఐవీ ఎయిడ్స్ నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విస్తృతం గా ప్రచారం చేస్తుంది. యువకుల్లో హెచ్ ఐవీపై అవగాహన చైతన్యం, రావాల్సి ఉంది. సురక్షితం కానీ లైంగిక వ్యవహా రాలకు దూరంగా ఉండడం మంచిది.
మందులకు వస్తున్నారు.. కాంపెల్లి గంగాధర్, సిరిసిల్ల లింక్ ఏఆర్‌టీ ఇన్‌చార్జి
సిరిసిల్ల లింక్ ఏఆర్‌టీ నుంచి ప్రతీనెలా 340 మంది మందులు తీసుకొని వెళ్తున్నా రు. నోడల్ కేంద్రం కరీంనగర్ కావడం వల్ల ఇక్కడ పాజిటివ్ తేలిన వారిని కరీం నగర్‌కు పంపిస్తున్నాం. కొంతమంది కరీం నగర్ వెళ్లడానికి ఇష్టపడడం లేదు. నోడల్ కేంద్రం ఏర్పాటైతే ఉపయోగకరంగా ఉంటుంది.