నేటి నుంచి.. పిల్లల వైద్యుల రాష్ట్ర సదస్సు


హాజరుకానున్న 800 మంది ప్రతినిధులు
30న పాల్గొననున్న మంత్రులు



కరీంనగర్‌  : పుట్టిన నాటి నుంచి పెరిగే పిల్లల వరకు ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యాధులు, టీకాలు ఇతర అంశాలపై అధునాతన విషయాలను తెలుసుకునేందుకు శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు కరీంనగర్‌లో పిల్లల వైద్యుల రాష్ట్రస్థాయి సదస్సు జరుగుతుందని పిల్లల వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌కుమార్‌ తెలిపారు. గురువారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విజయేందర్‌రెడ్డి, పిల్లల వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ రాజేందర్‌, కార్యదర్శి డాక్టర్‌ అమిత్‌కుమార్‌ మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో 5వ సదస్సును కరీంనగర్‌లో నిర్వహించాలని నిర్ణయించి ఏర్పాట్లు చేపట్టామన్నారు. స్థానిక ప్రతిమ కళాశాలలో జరిగే సదస్సుకు రాష్ట్ర నలుమూలల నుంచి 800 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. సదస్సులో జరిగే చర్చల్లో పాల్గొనేందుకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో 80 మంది ప్రత్యేక ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. అన్ని జిల్లాల నుంచి 150 మంది పీజీ విద్యార్థులు పాల్గొంటారని వివరించారు. పుట్టిన నుంచి మొదలుకొని సంవత్సరంలోపు పిల్లలకు టీకాలు వేయించే విధానం వంటి అంశాలపై చర్చించడమే కాకుండా పిల్లల వైద్య విషయంలో వస్తున్న ఆధునిక మార్పులు, వైద్య విధానాలు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ నెల 30న మధ్యాహ్నం జరిగే సదస్సును అధికారికంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌, ఆర్థిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ఐఎంఏ అధ్యక్షుడు విజయేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రవిశంకర్‌, సంజయ్‌కుమార్‌, ప్రతిమ, చల్మెడ కళాశాలల ఛైర్మన్లు లక్ష్మినర్సింహారావు, శ్రీనివాస్‌రావు, జాతీయ నాయకులు పాల్గొంటారన్నారు. పిల్లల వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ రాజేందర్‌ మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో నిర్వహించే  సదస్సును ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్నట్లు చెప్పారు. శుక్రవారం చల్మెడ, ప్రతిమ కళాశాలలతో పాటు స్టార్‌ పిల్లల ఆసుపత్రిలో వేర్వేరుగా మూడు విభాగాల సైంటిఫిక్‌ సదస్సులు జరుగుతాయని తెలిపారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు విజయేందర్‌రెడ్డి మాట్లాడుతూ సదస్సుకు ఐఎంఏ తరఫున పూర్తి సహకారం ఉంటుందన్నారు. జిల్లా కార్యదర్శి డాక్టర్‌ అమిత్‌కుమార్‌ మాట్లాడుతూ సదస్సు నిర్వహణలో అందరి భాగస్వామ్యం ఉందని, సదస్సు రాష్ట్రస్థాయిలో నిలిచి పోతుందన్నారు. సమావేశంలో పిల్లల వైద్యులు మల్లికార్జున్‌, మహేందర్‌, శివకుమార్‌, రమేశ్‌, దుర్గేశ్‌, మల్లేశ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.