నిమ్స్‌లో పేద విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ

పంజాగుట్ట: పేద విద్యార్థులకు చేయూతనిచ్చేందుకు లయన్స్‌ క్లబ్‌ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా శనివారం పలువురు విద్యార్థులకు సైకిళ్లు అందజేసినట్లు లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ సెంటెనియల్‌ సంస్థ అధ్యక్షుడు పి.అశోక్‌, కార్యదర్శి భాస్కర్‌, ప్రోగ్రాం సమన్వయకర్త  భిక్షపతి అన్నారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా శనివారం నిమ్స్‌ ఆసుపత్రిలో రూ.3 లక్షల విలువైన 46 సైకిళ్లను రంగారెడ్డి జిల్లా వెల్జాల్‌ గల్స్‌ హైస్కూల్ విద్యార్థినులకు అందజేశారు. చదువుకునే పేద విద్యార్థులను ఆదుకోవడమే తమ లక్ష్యమన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలను తమ సంస్థ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ లయన్స్‌  క్లబ్‌ అధ్యక్షుడు  జాంగ్‌యూత్‌చాయ్‌ పియాంగ్‌బోక్‌  తదితరులు పాల్గొన్నారు.