మూత్రపిండం.. మంత్రదండం



నిరుపేదలపై కిడ్నీ ముఠా కన్ను


ఒక్కో దానికి రూ.లక్షల్లో చెల్లించేందుకు బేరసారాలు


భద్రాచలంలో ఆలస్యంగా వెలుగుజూసిన వైనం


భద్రాచలం:పట్టణంలోని ఐటీడీఏ రోడ్డులో నిరుపేదలు ఎక్కువగా నివసించే ఓ కాలనీపై కిడ్నీ(మూత్ర పిండాలు) వ్యాపారుల కన్ను పడటం స్థానికంగా చర్చనీయాంశమైంది. కొన్ని నెలలుగా కిడ్నీ రాకెట్‌ ముఠా ఈ దందాకు వ్యూహం రచించారు. అప్పులపాలైన పేద కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని బేరసారాలు సాగించారు. రూ.లక్షల్లో ఒప్పందాలను కుదుర్చుకుని అవయవాల వ్యాపారం చేయాలని ఆశించారు. కాలనీలో తమకున్న పరిచయాలను ఉపయోగించుకుని ఏపీలోని ఏలూరుకు చెందిన ఓ యువకుడు చక్రం తిప్పాడు. స్థానికంగా ఉన్న ఒకరిద్దరు సహకరించడంతో రూ.కోట్ల దందాకు తెరతీసిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


ట్టాలపై అవగాహన లేకనో.. పేదరికం పట్టి పీడించడం వల్లనో తమ అవయవాలను విక్రయించుకోవాలని కొందరు భావించారు. పేదల నిస్సహాయతను అవకాశంగా మల్చుకొని లబ్ధి పొందాలని కొందరు ప్రయత్నించారు. ఎక్కడ తేడా వచ్చిందో గానీ ఇప్పుడా ప్రయత్నాన్ని విరమించుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.


కాలనీపై కన్ను పడింది


ఐటీడీఏకు సమీపంలోని ఓ కాలనీలో సుమారు 10 మందిపై దళారుల కన్ను పడింది. ఈ కుటుంబాల పరిస్థితిని తెలుసుకుని స్థానికంగా తమకు తెలిసిన వారి ద్వారా రంగంలోకి దిగారు. అప్పులన్నీ తీర్చుకుని ఇళ్లు కట్టుకుని హాయిగా బతకొచ్చని నమ్మించారు. ఈ క్రమంలో స్థానికుల్లో ఆరుగురు నాలుగు నెలల కిందట ఏలూరు వెళ్లి అక్కడున్న దళారులతో చర్చలు చేశారు. అన్ని రకాల పరీక్షలను ఏలూరుకు సమీపంలోని ఆర్‌ఎంపీ ద్వారా చేయించారు. కొద్ది రోజులు ఆగిన తర్వాత చిన్న తిరుపతి రమ్మని చెప్పడంతో అక్కడికి వెళ్లి రక్త పరీక్షలు చేయించుకొన్నారు. వీరిలో ఒకరికి రక్తం తక్కువగా ఉండటంతో రక్తవృద్ధి కోసం కొన్ని మందులు వాడాలని సూచించారు. ఒక్కో కిడ్నీకి రూ.లక్షల్లోనే ఇచ్చేందుకు చర్చలు చేశారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి ఒక మూత్రపిండం ఇవ్వాల్సి ఉంటుందని దళారీ చెప్పడంతో పేదరికం పోతుందనే ఆశతో ఒప్పుకొన్నారు. దీనికి సంబంధించి కొందరు ఆ దళారీ వద్ద ఉన్న దస్త్రాల్లో సంతకాలు చేశారు. అందులో ఏమి రాసి ఉందో చూడలేదని ఓ బాధితుడు చెప్పారు.


గొడవల వల్లే బయట పడిందా...


బాధితుల ఆరోపణల ప్రకారం.. ఇదే కాలనీలో ఓ మహిళ తనకు రాజకీయ అండదండలు ఉన్నాయని చెప్పి రెండు పడక గదుల ఇళ్లను ఇప్పిస్తానని నమ్మించింది. ఈ మాటలకు నమ్మి ఆరుగురు పేదలు అప్పులు చేసి రూ.20 వేల చొప్పున ఇచ్చారు. మొదటి విడత ఇళ్ల కేటాయింపులో పేర్లు రాకపోవడంతో ఈసారి ఇచ్చే వాటిలో లబ్ధి చేకూరుతుందని నమ్మించింది. రెండో విడత జాబితాలోనూ తమ పేర్లు వచ్చే అవకాశం కనిపించడం లేదని డబ్బులు ఇచ్చిన శ్రీను, లత వాపోయారు. తమలాంటి బాధితులు ఇంకొందరు ఉన్నారని తెలిపారు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆ నాయకురాలిని నిలదీశారు. తాను ఎవరికీ డబ్బు ఇచ్చేది లేదని ఆ నాయకురాలు బదులివ్వడంతో వివాదం రాజుకుంటోంది. ఇలా ఇళ్ల కోసం డబ్బులు ఇచ్చింది... కిడ్నీలను విక్రయించేందుకు ప్రయత్నించింది ఒకే ప్రాంతానికి చెందిన వాళ్లు. వీరి మధ్య బంధుత్వం ఉంది. ఇలా ఈ వివాదం బయటపడినట్లు తెలిసింది. ఇక్కడి వివరాలను తెలుసుకున్న ఏలూరులోని దళారి మళ్లీ వీరిని పిలిపించలేదు. ఇప్పటి వరకు అయిన ఖర్చుల కింద ఒక్కొక్కరికి రూ.1,500 నుంచి రూ.2 వేలు చెల్లించినట్లు తెలిసింది. ఈ రెండు అంశాల్లో సూత్రధారులు ఎవరో పాత్రధారులు ఎవరో తేలాల్సి ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో నిరుపేదలకు ఇబ్బంది లేకుండా చూసి వాస్తవాలను వెలికి తీయగలిగితే మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని ప్రజలు కోరుతున్నారు.