డెంగీతో ఆర్‌ఎంపీ వైద్యుడి మృతి


జన్నారం: జ్వరం సోకిందని ఆసుపత్రికి వెళ్లాడు. పరీక్షలు చేస్తే తెల్లరక్త కణాలు తగ్గిపోయినట్లుగా తేలింది. మంచిర్యాలలో రెండు రోజులు, కరీంనగర్‌లో మూడు రోజులు చికిత్స పొందారు. అయినా ఎలాంటి ఫలితం కనిపించలేదు సరికదా ప్లేట్‌లెట్స్‌ 16వేలకు పడిపోయాయి. వెంటనే హైదరాబాద్‌ తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షలు చేయగా ఊపిరితిత్తులు, కాలేయంలోనూ సమస్య ఉన్నట్లుగా తేలింది. షుగర్‌ లెవల్స్‌ సైతం అధికం కావడంతో వెంటిలేషన్‌ మీద కొనసాగించారు. చివరకు శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే... మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన తర్ర లక్ష్మణ్‌(49) గత 25 ఏళ్లుగా దండేపల్లి మండలం లక్ష్మీకాంతపూర్‌లో నివాసం ఉండి ఆర్‌ఎంపీ వైద్యుడిగా పని చేస్తున్నారు. గత శనివారం అనారోగ్యం బారిన పడడంతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. డెంగీ అని తేలడంతో ఆ కోణంలోనూ చికిత్స చేయించుకున్నప్పటికిని శరీరంలోని కొన్ని అవయవాలు చెడిపోవడంతో మృతి చెందారు. లక్ష్మణ్‌ భార్య సైతం అనారోగ్యంతోనే పదేళ్ల క్రితం మృతి చెందారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. అందరితో కలివిడిగా ఉండే లక్ష్మణ్‌ మృతితో చింతగూడలో విషాదం అలుముకుంది.