హృద్రోగ చికిత్సలకు కృత్రిమ ఎంజైములు


బెంగళూరులో అభివృద్ధి చేస్తున్న పరిశోధక బృందం


దిల్లీ: సహజసిద్ధ ఎంజైములను తలపిస్తూ జీవక్రియలను నియంత్రించే నానో అణువులు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. కృత్రిమ ఎంజైములుగా పిలుస్తున్న ఈ అణువులను ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ) ప్రొఫెసర్‌ జి.ముగేశ్‌ నేతృత్వంలోని పరిశోధక బృందం బెంగళూరులో ఉత్పత్తి చేస్తోంది. సాధారణంగా మానవ కణాల్లో రసాయనిక చర్యలను ఎంజైములు నియంత్రిస్తాయి. జబ్బు పడినప్పుడు అవి ప్రభావవంతంగా పనిచేయవు. అలాంటి పరిస్థితుల్లో అచ్చం సహజసిద్ధ ఎంజైముల తరహాలో పనిచేస్తూ జీవక్రియలను నియంత్రించగల కృత్రిమ ఎంజైములను తాము తయారుచేస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు. ప్రధానంగా గుండెపోటు సహా హృదయం-రక్తనాళాల సంబంధిత రుగ్మతలను నయం చేసే సరికొత్త చికిత్సా మార్గాలను అభివృద్ధి చేసేందుకు అవి దోహదపడే అవకాశముందని పేర్కొన్నారు.