వైద్యుని కాంస్య విగ్రహం ఆవిష్కరణ


విశాఖ: మన్యంలో గిరిజనుల కోసం అహర్నిశలు పనిచేసిన ఓ వైద్యుడి పేరు ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పెట్టి ఆయన ఘనత చాటారు.  గతేడాది ఆకస్మికంగా మృతి చెందడంతో ఐటీడీఏ అధికారులు ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. విశాఖ మన్యం చింతపల్లి మండలం లోతుగెడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 2002 నుంచి సత్యనారాయణ అనే వైద్యుడు మెరుగైన సేవలు అందించారు. అహర్నిశలు కష్టించి రాత్రనక పగలనక గిరిజనుల ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్లు వైద్యం అందించారు. 2018 నవంబర్ 29న ఆకస్మికంగా మృతి చెందారు. దీంతో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బాలాజీ లోతుగెడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సత్యనారాయణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా మార్చారు. ఏజెన్సీలో ఆయన అందించిన వైద్య సేవలకు గుర్తుగా ఆసుపత్రి ముందు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, పాడేరు ఐటీడీఏ పీవో బాలాజీ ఆవిష్కరించారు. ఆయన సేవలను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆకాంక్షించారు.