ఈ చిన్నారికి కుడివైపు గుండె


లక్షల్లో ఒకరికి ఇలాగే..
- తూప్రాన్‌ దవాఖానలో జననం

తూప్రాన్‌ : సాధారణంగా ప్రతి ఒక్కరికి ఎడమవైపు గుండె ఉంటుంది. అయితే ఈ చిత్రంలోని చిన్నారికి కుడివైపు ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. శుక్రవారం మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో ఈ శిశువు జన్మించింది. తూప్రాన్‌ పట్టణ పరిధిలోని ఆబోతుపల్లికి చెందిన రమ్యకు రెండేండ్ల కూతురు పావని ఉన్నది. రెండో కాన్పు కోసం ఆరు నెలల గర్భవతిగా ఉన్న సమయంలో రమ్య స్థానిక సుష్మా దవాఖాన వైద్యులు ప్రదీప్‌సింహను ఆశ్రయించారు. స్కానింగ్‌ చేయగా శిశువుకు ఎడమ వైపు కాకుండా కుడివైపు గుండె ఉన్నట్టు నిర్ధారించారు. దీంతో రమ్య ఆమె కుటుంబీకులు ఆందోళకు గురయ్యారు. కుడివైపు గుండె లక్షల్లో ఒకరికి ఉంటుందని, ఇలా ఉన్నంత మాత్రాన ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని వైద్యులు భరోసా కల్పించారు. శుక్రవారం తెల్లవారుజామున రమ్యకు పురిటి నొప్పులు రావడంతో సుష్మా దవాఖానలో చేర్పించగా సాధారణ ప్రసవంలో ఆడశిశువుకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.