అభివృద్ధి కమిటీల నియామకానికి చర్యలు
మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
మచిలీపట్నం:జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన వసతులు కల్పించి ప్రగతి పథంలో నడిపించేందుకు నియమించిన అభివృద్ధి కమిటీల కాలపరిమితి ఈ ఏడాది మార్చితో ముగియడంతో వాటిపై పర్యవేక్షణ కొరవడింది. ఫలితంగా ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు కీలక పనులు, సమస్యల పరిష్కారంలో జాప్యం ఏర్పడుతోంది. అందుకే పీహెచ్‌సీలతోపాటు సామాజిక ఆరోగ్యకేంద్రాలు, ప్రాంతీయ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులకు సాధ్యమైనంత త్వరగా కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సంబంధించి ఇటీవల మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. దీనికి సంబంధించి జిల్లా వైద్యఆరోగ్యశాఖ నుంచి పీహెచ్‌సీ వైద్యాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులను సంప్రదించి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కమిటీలు ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
గతంలోనూ..
ప్రభుత్వాసుపత్రుల్లో అభివృద్ధి కమిటీలు ఎప్పటినుంచో ఉన్నాయి. గత ప్రభుత్వం సంఘసేవకులను కూడా భాగస్వాములను చేయాలని భావించి 2016లో కొత్తగా ఉత్తర్వులు జారీ చేయడంతో అప్పటికే ఉన్న కమిటీలను రద్దుచేసి నూతన విధానాలను రూపొందించింది. దీంతో ఆయా పీహెచ్‌సీల పరిధిలోని పలువురు ప్రముఖులు అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్యకేంద్రాల్లో ఆరుగురి సభ్యులతో కమిటీలను ఏర్పాటు చేశారు. సామాజిక సంఘసేవకునితోపాటు ఆసుపత్రి వైద్యుడు కన్వీనర్‌గా ఎంపీడీవో, మహిళా సమాఖ్య సభ్యురాలు, మిగిలిన సభ్యులను ఆసుపత్రి పరిధిలోని ఇతర వ్యక్తులకు ప్రాతినిధ్యం కల్పించారు. ప్రాంతీయ ఆసుపత్రుల్లో ఎనిమిది మంది సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కమిటీల్లో సమూలంగా మార్పులు చేసి 2016కు ముందు ఉన్న విధానాన్నే అమలు చేయాలని నిర్ణయించింది.
కొత్త కమిటీల్లో ఎవరెవరు ఉంటారంటే..
జిల్లా ఆసుపత్రులు
ఛైర్మన్‌గా కలెక్టర్ వ్యవహరిస్తారు. ఆసుపత్రి పరిధిలోని ఎమ్మెల్యే కో-ఛైర్మన్‌గా ఉంటారు. మెడికల్ సూపరింటెండెంట్ కన్వీనర్‌గా, డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌ఎస్, నర్సింగ్ సూపరింటెండెంట్, నగరపాలకసంస్థ కమిషనర్, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ లేదా మేనేజర్, జిల్లా సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శుల్లో ఒకరు ఉంటారు.
ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు
మండలంలో ఉన్న పీహెచ్‌సీల అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌గా ఎంపీపీ ఉంటారు. ఈయనతోపాటు ఆసుపత్రి వైద్యాధికారి కన్వీనర్‌గా, తహసీల్దారు, ఎంపీడీవో, పీహెచ్‌సీ ఉన్న గ్రామ సర్పంచి, ఎంపీపీ నామినేట్ చేసే ఒక మహిళా సర్పంచి సభ్యులుగా ఉంటారు.
సామాజిక ఆరోగ్యకేంద్రాలు
జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో 12 సామాజిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వాటికి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఛైర్మన్‌గా ఉంటారు.ఆసుపత్రి వైద్యుడు కన్వీనర్‌గా, సంఘ సేవకులు ఇద్దరు, పురపాలక సంఘ కమిషనర్, ఎంపీడీవోలు, మండల మహిళా సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శుల్లో ఎవరో ఒకరు సభ్యులుగా ఉంటారు.
ప్రాంతీయ ఆసుపత్రులు
ప్రాంతీయ ఆసుపత్రులకు ఎమ్మెల్యే ఛైర్మన్‌గా ఆసుపత్రి సూపరింటెండెంట్ కన్వీనర్‌గా ఉంటారు. ముగ్గురు సామాజిక సేవకులు, ఆర్డీవో లేదా సబ్‌కలెక్టర్, పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శుల్లో ఒకరు, పురపాలక సంఘ కమిషనర్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి ఒకరు, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ, డీఎంహెచ్‌వో సభ్యులుగా ఉంటారు.
నిరాశలో నాయకులు
ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో పదవులు దక్కించుకునేందుకు పలువురు నాయకులు ఎంతో ఆశతో ఉన్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో నాయకులు కమిటీ ఛైర్మన్‌తోపాటు సభ్యుల పదవుల కోసం ఎమ్మెల్యేలకు అర్జీలు కూడా అందించారు. ఏదో ఒక పదవి వస్తుందని ఆశిస్తున్న సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారిని తీవ్ర నిరాశకు గురిచేసింది.
నిధులు పెంచే అవకాశం
కమిటీల ఏర్పాటుకు మార్గదర్శకాలు విడుదలయ్యాయి. వైద్య విధాన పరిషత్ పరిధిలోని ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రుల్లో కమిటీల ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దానిపై విధి విధానాలు ఖరారు కావాల్సి ఉంది.ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కమిటీల ఏర్పాటు చేయడంతోపాటు వసతుల కల్పనకు కృషి చేస్తాం.
- కిరణ్మయి, డీసీహెచ్
మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు
ఆసుపత్రి అభివృద్ధి కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. కమిటీల ఏర్పాటుపై ప్రభుత్వ ఉత్తర్వులను ఆయా పీహెచ్‌సీలకు అందజేశాం. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల సహకారంతో త్వరలోనే అన్ని పీహెచ్‌సీలకు కమిటీలు ఏర్పాటు చేయనున్నాం. కమిటీలను నియమించిన వెంటనే సమావేశాలు నిర్వహించి ఆసుపత్రులకు అవసరమైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం.
శ్రీరామచంద్రమూర్తి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి