జనగామ మెడికల్ హబ్


-సంపూర్ణ ఆరోగ్య సమాజంవైపు అడుగులు
-జిల్లా దవాఖానగా అవతరించిన ఏరియా హాస్పిటల్
-అనుబంధంగా మాతాశిశు ఆరోగ్య కేంద్రం ఏర్పాటు
-కిడ్నీవ్యాధుగ్రస్తులకు వరం.. డయాలసిస్ సెంటర్
-మరిన్ని విభాగాల ఏర్పాటుకు సర్కార్ గ్రీన్‌సిగ్నల్
-జిల్లాలో విస్తృతం అవుతున్న వైద్య సేవలు
-హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు



జనగామ : ఆరోగ్య తెలంగాణకు వేగంగా అడుగులు పడుతున్న తరుణంలో మెడికల్ హబ్‌గా జిల్లా రూపాంతరం చెందుతున్నది. ఇందులో భాగంగా ఏర్పాటైన మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్), జిల్లా వైద్యశాలలోని డయాలసిస్ కేంద్రాల్లో కార్పొరేట్‌కు దీటుగా వైద్య సేవలు అందుతున్నాయి. ప్రైవేట్ వైద్యశాలలకు వెళ్లి జేబులు గుల్ల చేసుకోవాల్సిన అవసరం లేకుండా సర్కార్ దవాఖానల్లోనే పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. వీటికి తోడు తెలంగాణ ప్రభుత్వం వ్యాధి నిర్ధారణ పరీక్షల కేంద్రాన్ని జిల్లాకు మంజూరు చేసింది. ఇక గుండె వ్యాధి నిర్ధారణ కేంద్రం అతిత్వరలోనే ప్రారంభం కానున్నది. ట్రామా కేర్ సెంటర్ కూడా జనగామలో నెలకొల్పడానికి సర్కారు సిద్ధంగా ఉంది. ఈ సేవలన్నీ త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. వరంగల్, హైదరాబాద్ లాంటి మహా నగరాలకే పరిమితమైన అన్ని రకాల సేవలు జిల్లాలోకి రానుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో జరుగుతున్న వైద్య రంగం అభివృద్ధిపై 'నమస్తే తెలంగాణ' ప్రత్యేక కథనం.


 


వైద్య విధాన పరిషత్ పరిధిలో 1999 జూన్ 30న జనగామ ప్రాంతీయ వైద్యశాల ఆవిర్భవించింది. కొత్త జిల్లాల ఏర్పాటు జరిగాక రెండేళ్ల క్రితం జిల్లా దవాఖానగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం 100 పడకలతో వివిధ విభాగాలను ఏర్పాటు చేశారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఈఎన్‌టీ, ఆర్థో, ఫిజియోథెరపి, దంత, నేత్ర, మానసిక వైద్య విభాగాలు వైద్య సేవలందిస్తున్నాయి. చికిత్స కోసం వచ్చిన వారికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసే ప్రయోగశాలలు, రక్తనిధితోపాటు ఎంతో విలువైన సిటీ స్కానింగ్ యంత్రం అందుబాటులో ఉంది. ఈసీజీ, ఎక్స్‌రే వంటి పరీక్షలను సైతం చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కళాశాల విద్యార్థులు విద్యనభ్యసించడానికి నిత్యం వందల సంఖ్యలో దవాఖానకు వస్తుంటారు. మరో 150 పడకలు అవసరమని ప్రతిపాదనలు ఇక్కడి అధికారులు ప్రభుత్వానికి పంపించారు. అవి మంజూరైతే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల 250 పడకలకు చేరుకుంటుంది. సాధారణ శస్త్రచికిత్సలు సగటున రోజుకు ఎనిమిది నిర్వహిస్తున్నారు. జిల్లా వైద్యశాలగా రావాల్సిన నిధులు విడుదల కావాల్సి ఉంది.

హైదరాబాద్ తరహాలో..
మూత్రపిండాలు విఫలమైనప్పుడు తప్పనిసరిగా డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. శరీరంలోని రక్తాన్ని మూత్రపిండాలు శుద్ధి చేస్తాయి. అనంతరం ఆ రక్తం శరీరమంతా ప్రసరణ అవుతుంది. పలు కారణాల వల్ల మూత్రపిండాలు పని చేయవు. అలాంటి సమయంలో యంత్రం సహాయంతో శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేస్తారు. ఈ ప్రక్రియనే డయాలసిస్ అంటారు. గతంలో డయాలసిస్ కోసం బాధితులు హైదరాబాద్‌కు పరుగులు పెట్టేవారు. ఇక్కో డయాలసిస్‌కు రూ. 5 వేల వ్యయం అవుతుంది. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని బట్టి వారానికి ఒకసారి, రెండుసార్లు చేయాల్సి వస్తుంది. డయాలసిస్ అవసరమైన వారికి దీర్ఘకాలం చేయించుకోవాల్సి ఉంటుంది. ఎంతో ఖరీదైన ఈ వైద్యాన్ని ప్రభుత్వం ఉచితంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందిస్తున్నది. హైదరాబాద్‌కు వెళ్లే అవసరం లేకుండా జనగామలోనే డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ కేంద్రంలో రోజుకు 40 మందికి ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నది.

ట్రామా కేర్ సెంటర్‌కు గ్రీన్‌సిగ్నల్
రోడ్డు ప్రమాదాల్లో క్షతగావూతులకు మొదటి గంటలో అందించే చికిత్స అత్యంత కీలకమైంది. ఈ సమయంలో సరైన చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. అయితే, సత్వర సాయం అందడంలో జాప్యం జరుగుతుండడంతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ జాప్యాన్ని నివారించి ప్రాణాల్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. వీటి ఏర్పాటుకు సుమారు రూ. 20 కోట్ల వ్యయం కానుంది. ఇందులో జనగామకు చోటు కల్పించారు. జనగామ చుట్టు పక్కల ప్రాంతాల్లో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. సూర్యాపేట, హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట రోడ్లలో ప్రమాదాలు ఎక్కువ అవుతుండడంతో ప్రభుత్వం జనగామలో ట్రామా కేర్ కేంద్రం ఏర్పాటు చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

వ్యాధి నిర్ధారణ కేంద్రం సిద్ధం
దేశంలోనే మొట్ట మొదటిసారిగా వ్యాధి నిర్ధారణ పరీక్షల కేంద్రాలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వాటి నిర్వాహణ కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం నిధులను కేటాయించింది. ప్రయోగశాలలు ఏర్పాటు చేసే జిల్లాల్లో జనగామకు చోటు లభించింది. పలు జిల్లాల్లో ప్రయోగశాలల కోసం ప్రభుత్వం రూ. 24 కోట్ల నిధులను కేటాయించింది. హైదరాబాద్‌లోని ఎంఎస్‌ఐడీసీలో ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి, రాష్ట్రవ్యాప్తంగా జరిగే డయాగ్నస్టిక్ సర్వీసులను పర్యవేక్షించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. డయాగ్నస్టిక్ సేవల్ని ఏర్పాటు చేయడానికి జిల్లాకేంవూదంలోని ప్రభుత్వ దవాఖాన ఎదురుగా ఉన్న భవనాన్ని సిద్ధం చేశారు. ఇక సేవలు ప్రారంభం కావడమే తరువాయి.

త్వరలో ఇంటింటికీ క్యాన్సర్ పరీక్షలు
ఇప్పటికే కంటి కేసీఆర్ కిట్ వంటి విన్నూత కార్యక్షికమాలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ క్యాన్సర్ పరీక్షలు అనే సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. తొలుత 12 జిల్లాలో ఈ కార్యక్షికమాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. అందులో జనగామ జిల్లా ఒకటి. ఈ మేరకు సిబ్బందికి శిక్షణ సైతం ఇచ్చారు. క్యాన్సర్ బాధితుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎక్కువ శాతం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ బాధితులే. పురుషుల్లో ఎక్కువ మంది నోటి క్యాన్సర్ బారిన పడిన వారే. తొలి దశలోనే వ్యాధిని గుర్తించి చికిత్స ప్రారంభించడం ద్వారా ప్రాణాపాయం తప్పించవచ్చనే భావనతో ప్రభుత్వం ఉచితంగా ఇంటింటికీ క్యాన్సర్ పరీక్షల కార్యక్షికమాన్ని త్వరలోనే ప్రారంభించనుంది.

జిల్లాకేంవూదాల్లో పీజీల వైద్య సేవలు..!
బోధన వైద్యశాలలకే పరిమితమైన పీజీ విద్యార్థుల వైద్యసేవలు త్వరలో జిల్లాకేంవూదంలోని వైద్యశాలల్లో కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. వివిధ విభాగాల్లో పీజీ కోర్సులు అభ్యసిస్తున్న వారు తమతమ వైద్య కళాశాలలకు దగ్గర్లోని జిల్లా దవాఖానల్లో సేవలందించాలనే నిబంధనను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తీసుకురానుంది. ఈ విషయమై భారతీయ వైద్య మండలిలో(ఎంసీఐ) చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖతో ఎంసీఐ ఏకాభివూపాయం వ్యక్తం చేస్తే తప్పనిసరిగా పీజీలు జిల్లాకేంవూదంలోని వైద్యశాలల్లో సేవలందించాల్సిందే. ఎంసీఐ ఏమైన షరుతులు విధిస్తుందా అనేది వేచి చూడాలి. ఏదేమైనా ఈ ఆలోచన దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.

చివర్లో స్వాంతన
జీవితం చరమాంకంలో ఉన్న వారికి స్వాంతన చేకూరడానికి ప్రత్యేకంగా పాలియేటివ్ కేర్‌ను జనగామ ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేశారు. ఓ ప్రైవేట్ సంస్థ సహకారంతో ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ఏడాది క్రితం ప్రారంభించింది. క్యాన్సరే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి ఈ కేంద్రం సిబ్బంది సేవలందిస్తారు. వారివారి ఇండ్ల వద్ద సేవలందించే వీలుంటే.. ఇంటికి వెళ్లి సహాయం చేస్తారు. లేదంటే కేంద్రానికి తీసుకెళ్లి బాధితుల బాధ్యతను తీసుకుంటారు. వారి రవాణా కోసం ఈ కేంద్రానికి ప్రత్యేకంగా వాహనం సైతం అందుబాటులోకి ఉంది.