తీర్పు వెలువరించిన హైదరాబాద్ వినియోగదారుల ఫోరం-3
హైదరాబాద్: వినియోగదారుడికి అందించాల్సిన వైద్య సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు రూ.8,00,000 పరిహారంగా చెల్లించాలని నగర వినియోగదారుల ఫోరం-3 మెడిసిటీ ఆసుపత్రి వైద్యులు డా.మహ్మద్ పర్వేజ్ (కన్సల్టెంట్ ఫిజీషియన్), డా.ప్రీతమ్, మెడిసిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌లను ఆదేశించింది. తిరుమలగిరికి చెందిన ఫిర్యాదుదారు ఆర్.శ్రీనివాసరావు పేర్కొన్న వివరాల ప్రకారం.. తన తండ్రి ఆర్.ధర్మపురి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అల్వాల్‌లో ఉన్న సీజీహెచ్‌ఎస్ డిస్పెన్సరీ నుంచి మెడిసిటి ఆసుపత్రిలో చేర్పించారు. ఈ నేపథ్యంలో ప్రతివాద వైద్యులు డా.మహ్మద్ పర్వేజ్ (కన్సల్టెంట్ ఫిజీషియన్), డా.ప్రీతమ్ పర్యవేక్షణలో చికిత్స అందించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ధర్మపురి మరణించారు. చికిత్స వికటించడం, వైద్యం అందించడంలో నిర్లక్ష్యం కారణంగానే తన తండ్రి మరణించాడని ఫిర్యాదుదారు నగర వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. చికిత్స అందిస్తున్న క్రమంలో తన తండ్రి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడని, వైద్యం అందించమంటే ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని వివరించారు. ఫిర్యాదుదారు వాదనలను ఖండించిన ప్రతివాదులు ఫోరంనకు రాతపూర్వక వివరణ అందించారు. ఫిర్యాదుదారుడివి అసత్య ఆరోపణలంటూ తెలిపారు. ఇరువురి వాదప్రతివాదనలు విన్న ఫోరం-3 వినియోగదారుడికి రూ.8,00,000 పరిహారం చెల్లించాలని తీర్పు వెలువరిచింది. ప్రతివాదులు ముగ్గురు కలిసి ఈ మొత్తాన్ని చెల్లించాలని, రూ.20,000 ఖర్చులకు ఇవ్వాలని పేర్కొంది.
ఆదిత్య ఆసుపత్రికి రూ.8లక్షలు జరిమానా
ఫిర్యాదుదారు కె.వరలక్ష్మి, అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని ఆదిత్య ఆసుపత్రిలో చేరారు. గైనకాలజిస్టు ఇ.ఆదిలక్ష్మి పర్యవేక్షణలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. అనంతరం సెప్టిక్ కావడంతో మళ్లీ ఆసుపత్రిలో చేరి చికిత్స పూర్తి చేసుకుని డిశ్చార్జీ అయ్యారు. మళ్లీ వ్యాధి తిరగదోడటంతో మళ్లీ అదే ఆసుపత్రిలో చేరారు. చికిత్స కోసం పలు దఫాలుగా మొత్తం రూ.3,85,000 చెల్లించారు. ఎంతకీ తన ఆరోగ్యం బాగుపడటం లేదని నిర్ధారించుకున్న వరలక్ష్మి సరైన వైద్యం అందించలేదంటూ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. చికిత్స వికటించి తాను ఇబ్బందులు గురవుతున్నానంటూ, వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదుదారు వాదనలను ఖండిస్తూ ప్రతివాద పర్యవేక్షక వైద్యురాలు ఆదిలక్ష్మి ఫోరంనకు రాతపూర్వక వివరణ అందించారు. ఇరువురి వాద, ప్రతివాదనలు విన్న ఫోరం-3 వినియోగదారుడికి ఊరట కలిగించే తీర్పు వెలువరించింది. ఆదిత్య ఆసుపత్రి, పర్యవేక్షక వైద్యురాలు సంయుక్తంగా వినియోగదారుడికి రూ.8లక్షలు పరిహారంగా ఇవ్వడంతో పాటు ఖర్చులకు రూ.25,000 చెల్లించాలంటూ తీర్పును వెలువరించింది.