వెల్‌నెస్‌ సెంటర్‌లో గడువు ముగిసిన కిట్లు


విచారణకు సీపీఐ(ఎం) నేతల డిమాండ్‌



ఖైరతాబాద్‌ : ఉద్యోగ, పాత్రికేయ ఆరోగ్య పథకం (ఈజేహెచ్‌ఎస్‌)లో కుంభకోణం చోటుచేసుకుందని.. వెంటనే విచారణ జరిపించాలని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేసింది. ఖైరతాబాద్‌లోని వెల్‌నెస్‌ సెంటర్‌ ఎదుట పార్టీ నాయకులు గురువారం ధర్నా నిర్వహించారు. అనంతరం వెల్‌నెస్‌ సెంటర్‌లోకి వెళ్లి ల్యాబ్‌, పరికరాలు, కిట్లను పరిశీలించారు. గడువు ముగిసినా ఇంకా ఎందుకు ఉంచారని అక్కడి సిబ్బందిని పార్టీ నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌ ప్రశ్నించగా .. ఏడాదిన్నర క్రితమే అధికారులకు లేఖ రాశామని, ఎవరూ తీసుకెళ్లలేదని పేర్కొన్నారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పార్టీ నేతలు ఎం.శ్రీనివాసులు, ఎం.దశరథ్‌, ఎం.మహేందర్‌, అరుణజ్యోతి, జి.నరేష్‌, ఆర్‌.వాణి, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.