వైద్య సేవల్లో ప్రథమం ...డీఎంహెచ్‌వోకు మంత్రి సన్మానం


కరీంనగర్‌ పట్టణం, న్యూస్‌టుడే : వైద్య ఆరోగ్య శాఖ ద్వారా వైద్య సేవలతో పాటు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల అమల్లో కరీంనగర్‌ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో వైద్యారోగ్య శాఖ మంత్రి సమక్షంలో జరిగిన సమీక్ష సమావేశం సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్‌ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రాంమనోహర్‌రావును శాలువాతో సన్మానించి ప్రశంసాపత్రం అందించారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ సిబ్బంది, ఇతర వైద్యాధికారులు జిల్లా అధికారిని గురువారం సన్మానించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో గత రెండు మాసాలుగా ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రసవాలు, కేసీఆర్‌ కిట్‌ అమలు, అసంక్రామిత వ్యాధుల సర్వే, వైద్య సదుపాయాలు కల్పించడం, జిల్లాలోని 313 గ్రామాల్లో ఆరోగ్య కమిటీలు ఏర్పాటు చేయడం, నిరంతర సమీక్షలు, పర్యవేక్షణ తదితర కార్యక్రమాల్లో జిల్లా ముందంజలో నిలిచినట్లు వైద్య శాఖ ప్రకటించింది.


గతంలో 29వ స్థానంలో ఉన్న జిల్లాను మొదటి స్థానానికి తెచ్చేందుకు డాక్టర్‌ రాంమనోహర్‌రావు చేసిన కృషిని మంత్రితో పాటు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి శాంతాకుమారి, కమిషనర్‌ యోగితారాణి, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు తదితరులు అభినందించారు. అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలుగా ఎంపికైన చల్లూరు, గంగాధర ఆస్పత్రుల వైద్యాధికారులను మంత్రి అభినందించారు. ఈ మేరకు గురువారం కరీంనగర్‌లోని జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారిని సన్మానించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు సుజాత, జువేరియా, శిరీష, రవిసింగ్‌, రవీందర్‌, దుర్గారావు, జగదీశ్వర్‌, పుష్ప, కాంతారావు పాల్గొన్నారు. పూలమొక్కలు అందించి శాలువాతో సత్కరించారు.