ఖమ్మం: జిల్లా వ్యాప్తంగా రోగులకు మెరుగైన వైద్యసేవలందించి ఖమ్మం జిల్లాకు పేరుప్రఖ్యాతులు తీసుకురావాలని, అన్ని పీహెచ్‌సీ సెంటర్లలో, మెడికల్ ఆఫీసర్లు, వైద్యులు పనిచేసి ఆరోగ్య ఖమ్మంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ బీ కళావతిబాయి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గత రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో జిల్లా వైద్యారోగ్య కార్యక్రమాల అమలుపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్ని జిల్లాల వైద్యారోగ్య శాఖాధికారులు, ఆరోగ్య ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో చర్చించిన విషయాలపై జిల్లాలో పనిచేస్తున్న ప్రోగ్రాం అధికారులకు వైద్యారోగ్య కార్యక్రమాల అమలులో ముందుండాలని ఆమె ఆదేశించారు. జిల్లాలో అమలు జరుగుతున్న వైద్యారోగ్య కార్యక్రమాలలో భాగంగా క్షయ నియంత్రణ కార్యక్రమం, అసంక్రమణ వ్యాధుల నివారణ, జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ, జాతీయ ఆరోగ్యమిషన్ కార్యక్రమాల అమలు తీరు చాలా బాగున్నాయని, మిగతా కార్యక్రమాలను కూడా అమలును అభివృద్ధి చేయాలని కోరారని ఆమె తెలిపారు. ముఖ్యంగా కంటివెలుగు ప్రిస్క్రిప్షన్ గ్లాసులను అందరికీ అందించి ఆన్‌లైన్ అప్‌డేట్ చేయాలని మంత్రి ఈటల సూచించినట్లు తెలిపారు. వ్యాధి నిరోధక టీకాలు, కేసీఆర్ కిట్ పోర్టర్‌లలో పూర్తిస్థాయిలో అప్‌డేట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఆమె వివరించారు.
కుష్టువ్యాధి కేసులను గుర్తించేందుకు ఉదయం 6 గంటల సమయాన్ని పోడిగించి 9 గంటలలోపు పూర్తి చేసి వారికి తగిన చికిత్సలు అందించి ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలని సూచించినట్లు తెలిపారు. ప్రతి సబ్‌సెంటర్ పరిధిలో వీహెచ్‌ఎస్‌ఎన్‌సీ, వీహెచ్‌ఎన్‌డీ కార్యక్రమాలను పకడ్భందీగా అమలు చేసినప్పుడు ఆయా గ్రామాల్లో గల ప్రజలకు వైద్యారోగ్య కార్యక్రమాల పట్ల అవగాహన పెరుగుతుందని తెలిపారు. జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, సబ్ సెంటర్‌కి ప్రోగ్రామ్ అధికారులు వెళ్లినప్పుడు అన్ని వైద్యారోగ్య కార్యక్రమాలను సమీక్షించి వాటిని అప్‌డేట్ చేయాలని కోరారు. ముఖ్యంగా ఏ పీహెచ్‌సీలో వెనుకబడిందో తెలుసుకుని ఆయా పీఎస్‌సీని విజిట్ చేసి ఆ కార్యక్రమం అమలును సమీక్షించి ముందుకు నడపాలని కోరారు. అదే విధంగా 102 వాహనాలను ప్రజలకు ఉపయోగపడే విధంగా అందుబాటులో ఉంచి గర్భిణి స్త్రీల సంక్షేమం కోసం కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా పాలియేటివ్ కేర్‌లో గల రోగులకు మనోధైర్యం కనిపించాలని, అదే విధంగా ఎల్డరీకేర్ క్యాంపులు నిర్వహించి వారిఆరోగ్య క్షేమాల కోసం కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా జిల్లాను అన్ని ఆరోగ్య కార్యక్రమాలు అమలులో ముందుంచే విధంగా ప్రోగ్రాం అధికారులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీటీసీవో డాక్టర్ సుబ్బారావు, పీవో డాక్టర్ ప్రవీణా, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ మాలతీ, ఎంహెచ్‌ఎన్ పీవో డాక్టర్ రామారావు, సీహెచ్‌ఐ పీవో డాక్టర్ అలివేలు, ఎన్‌సీడీ పీవో డాక్టర్ కోటిరత్నం, డాక్టర్ ప్రమీలా, ఎస్‌డీపీవో నిలోహన, డీపీహెచ్‌ఎన్‌డీ విమల, డిప్యూటీ డెమో సాంబశివరెడ్డి, ఏఎస్‌ఓ నవీన్‌లు పాల్గొన్నారు.