చికిత్స కోసం వస్తే ..


ఉంగరం మాయం..మళ్లీ ప్రత్యక్షం!
తిరుమలగిరి ఆసుపత్రిలో ఘటన


కార్ఖానా: 'చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకొచ్చాం. అప్పటికే మా నాన్న పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. కొద్దిసేపు వైద్యం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆయన చనిపోయారు. మా ఊరికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేశాం. అంతకుముందు చూస్తే ఆయన వేలికి ఉండే ఉంగరం కనిపించలేదు. ఆసుపత్రి సిబ్బందే తీశారని ఇక్కడికి మళ్లీ వచ్చాం..' అంటూ  సిద్దిపేటకు చెందిన మృతుడి కుటుంబీకులు తిరుమలగిరి ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆ తర్వాత ఉంగరం 'దొరకడం'తో తిరిగి ఇంటికి వెళ్లిపోయారు.ప్రధాన బాధితుడు శ్రావణ్‌ తండ్రి కొండూరి సత్తయ్య (70) కొన్ని రోజుల నుంచి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. ఈ నెల 26న సమస్య తీవ్రం కావడంతో, సిద్దిపేట నుంచి చికిత్స నిమిత్తం తిరుమలగిరి ఆసుపత్రికి తీసుకొచ్చారు. మృతదేహాన్ని అప్పగించేందుకు సిబ్బంది సిద్ధమైన సమయంలో.. మృతుడి ఉంగరం మాయమైంది. ఆయన కుమారుడు, కోడలు, మరో వ్యక్తి తిరిగి  ఆసుపత్రికి వచ్చి వైద్యులకు విషయం చెప్పారు. నిర్వాహకులు 26వ తేదీనాటి సీసీ కెమెరాలో ఫుటేజీ చూడటంతో, విషయమంతా బయటపడింది. ఉంగరాన్ని తిరిగి మృతుడి కుటుంబీకులకు అప్పగించడంతో, ఇంటికి వెళ్లిపోయినట్లు సమాచారం.