అక్కరకురాని వైద్య సిబ్బంది 500 మంది పైనే!



పనికొచ్చే విధంగా వీరి సర్దుబాటు
నిష్ఫలమైన ఆరోగ్య కేంద్రాలు మరోచోటుకు తరలింపు
వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయాలు



 హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎటువంటి ఫలితాలు ఇవ్వకుండా కొనసాగుతున్న ఆరోగ్య కేంద్రాలను తక్షణమే మరో ఉపయుక్తమైన ప్రాంతానికి తరలించాలని వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బోధనాసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో అనుబంధంగా కొనసాగుతున్న ఇలాంటి మరికొన్ని కేంద్రాల్లోనూ కలుపుకొంటే.. 'అదనపు సిబ్బంది' సుమారు 500 మందికి పైగానే ఉంటారని అంచనా వేసింది. వీరు కేవలం నామమాత్రపు విధుల్లో ఉంటున్నట్లుగా తేలడంతో.. ఇక నుంచి వైద్యసేవల్లో పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. పీహెచ్‌సీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేయనున్నారు.


నిరుపయోగంగా గుర్తించినవి..
ప్రసవానంతర చికిత్స అందించే వార్డులు
పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రాలు
బోధనాసుపత్రుల్లో అనుబంధంగా ఉండే వార్డులు
స్త్రీ శిశు సంక్షేమ శాఖ పరిధిలో నిర్వహించే చిన్నారుల సంక్షేమ కేంద్రాలు
నాగార్జునసాగర్‌ కెనాల్‌, డ్యామ్‌, కరీంనగర్‌ డ్యామ్‌ వంటి నిర్మాణాల సందర్భంగా ఏర్పడిన కాలనీల్లో ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రాలు
సంచార నేత్ర పరీక్ష యూనిట్‌
వీటన్నింటిలోనూ ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని సిబ్బంది పనిచేస్తున్నారు.


ఎందుకు నిరుపయోగం?
సుమారు 25 ఏళ్ల కిందట అప్పటి అవసరాలకు అనుగుణంగా జిల్లా, బోధనాసుపత్రుల్లో అదనపు సేవల్లో సహాయకారిగా ఉండేందుకు అనుబంధ వార్డులు, ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పారు. ఈ కేంద్రాలన్నీ ఇప్పుడు నామమాత్రంగా మారిపోయాయి. వీటిలో చికిత్స పొందే వారి సంఖ్య చాలా తక్కువని వైద్యఆరోగ్య శాఖ గుర్తించింది. అదేసమయంలో వైద్యసిబ్బంది సంఖ్య మాత్రం యథాతథంగా కొనసాగుతోంది. ముఖ్యంగా ఇవన్నీ పట్టణ ప్రాంతాల్లోనే అధికంగా ఉండడంతో వీటిలోనే కొనసాగడానికి వైద్యసిబ్బంది మొగ్గుచూపుతున్నారు. వైద్యులైతే ఏళ్లుగా ఒకేచోట కొనసాగుతూ ప్రైవేటు ప్రాక్టీసును కొనసాగిస్తున్నారు.


పీహెచ్‌సీలను చక్కదిద్దేందుకు..
పీహెచ్‌సీల్లో వైద్యుడుతోపాటు మొత్తంగా 8 మంది సిబ్బంది ఉండేలా చర్యలు.
24 గంటల పీహెచ్‌సీలోనూ ఇద్దరు వైద్యులతోపాటు మొత్తంగా 12 మంది సిబ్బంది ఉండాలి.
సీహెచ్‌సీల్లో ఒక డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ సూపరింటెండెంట్‌గా, గైనకాలజిస్ట్‌తోపాటు మొత్తం 14 మంది సిబ్బంది ఉండేలా చర్యలు
క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందిలో 90 శాతం మంది స్థానికంగా నివసించడంలేదు. వీరు ఆలస్యంగా వచ్చి, త్వరగా వెళ్లిపోతుండడంతో రోగులకు సరైనరీతిలో వైద్యసేవలు లభించడంలేదు. అందుకే అన్ని ఆరోగ్య కేంద్రాల్లోనూ సమయపాలన, హాజరు పరిశీలించడానికి సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు.


మెరుగైన వైద్యసేవలే లక్ష్యం
ప్రాథమిక వైద్యాన్ని బలోపేతం చేసి మెరుగైన సేవలందించాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యం. ఈ దిశగా వైద్యఆరోగ్య శాఖ చర్యలు చేపట్టుతోంది. నిరుపయోగంగా ఉన్న వైద్య సిబ్బంది సేవలను సక్రమంగా వినియోగించుకోవడంపై దృష్టిపెట్టాం. ఎక్కువ మంది ప్రజలకు వైద్యసేవలందించే విధంగా ఆరోగ్య కేంద్రాల స్థానాలను సర్దుబాటు చేస్తాం. మానవ వనరుల హేతుబద్ధీకరణను సాధ్యమైనంత త్వరలో అమలుచేస్తాం.
 


-ఈటల రాజేందర్‌, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి