వైద్యుల నిర్లక్ష్యంతోనే తల్లి మృతి



జగదాంబకూడలి, శ్రీకాకుళం : 'నడుము నొప్పని ఆసుపత్రిలో చేర్పిస్తే వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి తన తల్లిని చంపేశారని' కుమారుడు అరోపించారు. ఆసుపత్రి ఎదుట బాధిత కుటుంబ సభ్యులు నిరసన చేపట్టారు. ఆ ఆసుపత్రిపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన సాన కృష్ణవేణి(52)కి తీవ్రంగా నడుము నొప్పి రావడంతో జిల్లా పరిషత్‌ వద్దగల ఓ ఆసుపత్రిలో చేర్పించారు. రెండువారాల పాటు చికిత్స అందించారు. రోగి పూర్తిగా కొలుకుందని చెప్పి వైద్యులు డిశ్చార్జి చేయడంతో రోగిని తీసుకొని బంధువులు శ్రీకాకుళం వెళ్లిపోయారు. మళ్లీ వారం తర్వాత నడుము నెప్పి రావడంతో మళ్లీ అదే ఆసుపత్రికి తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ బుధవారం ఆమె మృతిచెందారు. దీంతో రోగి బంధువులు తీవ్ర ఆవేదన చెందారు. నడుము నొప్పని ఆసుపత్రికి తీసుకొస్తే రూ.5 లక్షల వరకు బిల్లులు వేసి చివరికి చంపేశారని రోగి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.