డిశ్చార్జి తర్వాత రోజుకు రూ.225









గరిష్టంగా నెలకు రూ.5వేలు రోగి ఖాతాలోకి  జమ 


ఆరోగ్యశ్రీలో ఆర్థిక సాయంపై మార్గదర్శకాలు విడుదల


డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి..


ఉత్తర్వులు జారీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ








అమరావతి : ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అనంతరం ఇంటి వద్ద కోలుకునే సమయంలో వేతన నష్టాన్ని భర్తీచేసేందుకు అందించే ఆర్థిక సాయానికి రాష్ట్ర ప్రభుత్వం  పలు మార్గదర్శకాలు జారీచేసింది. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ కె జవహర్‌రెడ్డి శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ 26 స్పెషాలిటీ వైద్య సేవలకు సంబంధించి 836 రకాల చికిత్సలకు ఈ ఆర్థిక సాయం వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే, ఆస్పత్రి నుంచి రోగి డిశ్చార్జి అయ్యాక ఏ జబ్బుకు ఎన్ని రోజుల్లో కోలుకుంటారనేది మార్గదర్శకాల్లో పొందుపరిచారు. ఈ ఆదేశాలు 2019 డిసెంబరు 1 నుంచి అమల్లోకి వస్తాయి. 



836 రకాల చికిత్సలకు వర్తింపు


బ్యాంకు ఖాతా లేకపోతే.. కుటుంబ సభ్యుల ఖాతాలోకి
- డిశ్చార్జి అనంతరం ఆర్థిక సాయం కింద రోజుకు రూ.225లు ప్రభుత్వం ఇస్తుంది. ఇలా గరిష్టంగా నెలకు రూ.5,000లు రికవరీ కాలానికి ఇస్తారు. 40 రోజులు ఆస్పత్రిలో ఉంటే 30 రోజులకు రూ.5వేలు, మిగతా పది రోజులకు రోజుకు రూ.225లు చొప్పున ఇస్తారు. మొత్తం 40 రోజులకు రూ.7,250లు ఇస్తారు. 
ఈ మొత్తం రోగి బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. ఒకవేళ రోగికి వ్యక్తిగత బ్యాంకు ఖాతా లేకపోతే రోగి కుటుంబ సభ్యుల్లో ఒకరి ఖాతాకు ఇవ్వవచ్చు. 
 నెట్‌వర్క్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన 48 గంటలలోపు రోగి బ్యాంకు ఖాతాకు ఈ మొత్తం జమ అవుతుంది. బ్యాంకు లావాదేవీలు వైఫల్యం చెందితే అవి విఫలమైన సమయం నుంచి 72 గంటలలోపు చెక్కు జారీచేస్తారు. ఆ చెక్కును సంబంధిత గ్రామ, వార్డు వలంటీర్ల సహాయంతో పంపిణీ చేస్తారు. 
ఏదైనా ఫిర్యాదు ఉంటే రోగులు, వారి బంధువులు శస్త్ర చికిత్స చేసిన నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు చెందిన ఆరోగ్య మిత్రను లేదా వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ జిల్లా కార్యాలయ సమన్వయకర్తను సంప్రదించవచ్చు. లేదా సంబంధిత గ్రామ సచివాలయాలను సంప్రదించవచ్చు. 
- ఒకే సంవత్సరంలో అదే సమస్య పునరావృతమైతే మొదటిసారి మాత్రమే భత్యం  మంజూరు చేస్తారు. 
అలాగే, కేన్సర్‌ రోగులకు పలుమార్లు చికిత్స లేదా రేడియేషన్‌ అవసరమైనప్పటికీ వారికీ ఒకసారి మాత్రమే అందజేస్తారు.